ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన మార్కెట్లలో ఒకటైన చైనాలో ఏవియేషన్‌ రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విమాన ఇంధన ధరల పెరుగుదల, దేశీయంగా తగ్గిన విమాన ఛార్జీలు, పోటీతో పాటు తుపాన్ల ప్రభావం విమానయాన సంస్థల ఆదాయాలను దెబ్బతీస్తున్నాయి. దీంతో చైనాకు చెందిన మూడు ప్రధాన సంస్థలు ఎయిర్‌ చైనా, చైనా ఈస్టర్న్‌ ఎయిర్‌లైన్స్‌, చైనా సదరన్‌ ఎయిర్‌లైన్స్‌ 2026 తొలి తొమ్మిది నెలల్లో నష్టాలను నమోదు చేశాయి. గత ఏడాది ఇదే సమయంలో లాభాల్లో ఉన్న సంస్థలు ఇప్పుడు నష్టాల బాట పట్టడం ఆందోళన కలిగిస్తోంది.

ఇంధన ధరల పెరుగుదలతో కష్టాలు

చైనాలో వేసవి సెలవుల కారణంగా జులై-సెప్టెంబర్‌ త్రైమాసికం విమానయాన సంస్థలకు సాధారణంగా అత్యధిక ఆదాయం వచ్చే సమయం. అయితే ఈ ఏడాది విమాన ఇంధన ధరలు భారీగా పెరగడంతో నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఫిబ్రవరి చివర్లో అమెరికా, ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై సైనిక చర్య ప్రారంభించిన తర్వాత జెట్‌ ఫ్యూయల్‌ ధరలు రెట్టింపునకు పైగా పెరిగినట్లు రాయిటర్స్‌ నివేదిక వెల్లడించింది. దీంతో సంస్థల లాభదాయకత తీవ్రంగా దెబ్బతింది.

దిగ్గజ సంస్థల ఆర్థిక పరిస్థితి

మూడో త్రైమాసికంలో చైనాకు చెందిన మూడు ప్రధాన విమానయాన సంస్థల ఫలితాలు ఇలా ఉన్నాయి.

  • ఎయిర్‌ చైనా: గత ఏడాదితో పోలిస్తే నికర లాభం 92.6 శాతం తగ్గి 270.6 మిలియన్‌ యువాన్లకు పరిమితమైంది.
  • చైనా ఈస్టర్న్‌ ఎయిర్‌లైన్స్‌: నికర లాభం 98.2 శాతం క్షీణించి 64 మిలియన్‌ యువాన్లకు పడిపోయింది.
  • చైనా సదరన్‌ ఎయిర్‌లైన్స్‌: గత ఏడాది 3.84 బిలియన్‌ యువాన్ల లాభం సాధించిన ఈ సంస్థ ఈసారి 609 మిలియన్‌ యువాన్ల నష్టాన్ని ప్రకటించింది.

తొమ్మిది నెలలుగా నష్టాలే

ఈ మూడు సంస్థలూ 2026 తొలి తొమ్మిది నెలల్లో నష్టాలను నమోదు చేశాయి. పెరిగిన ఇంధన వ్యయాలు, విమాన టికెట్ల ధరలపై ఒత్తిడి, తీవ్ర పోటీ వాటి ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చాయి. సాధారణంగా ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే వేసవి సీజన్‌లోనూ ఆశించిన లాభాలు రాకపోవడం చైనా విమానయాన రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను స్పష్టం చేస్తోంది.

By Ramya