
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 13 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం రీపోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అనంతపురం, తిరుపతి, కడప కార్పొరేషన్లతో పాటు మాచర్ల, చీమకుర్తి, జమ్మలమడుగు, పులివెందుల ప్రాంతాల్లోని ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు.
అనంతపురం కార్పొరేషన్లో 30/3, తిరుపతి కార్పొరేషన్లో 36/4, కడప కార్పొరేషన్లో 15/2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతోంది. అలాగే మాచర్ల 23వ వార్డులోని రెండు పోలింగ్ కేంద్రాలు, ప్రకాశం జిల్లా చీమకుర్తిలో 14/1, జమ్మలమడుగులో 3/2, 17/1, 29/1, పులివెందులలోని 1, 3, 7, 8 వార్డుల్లో ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. కొన్ని స్థానాలు ఏకగ్రీవం కావడంతో 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు. అయితే పలు పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) ఫిర్యాదులు అందాయి.
ఈ ఫిర్యాదులపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించింది. కలెక్టర్లు సమర్పించిన నివేదికల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరిగినట్లు వెల్లడైన నేపథ్యంలో 13 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఆయా కేంద్రాల్లో తిరిగి పోలింగ్ చేపట్టారు.
