
పులివెందుల: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయకుండానే వెనుదిరిగారు. పులివెందులలో ఎన్నికల నిర్వహణ తీరును నిరసిస్తూ తన ఓటు హక్కును వినియోగించుకోకూడదని నిర్ణయించుకున్నారు. రీపోలింగ్ నిర్వహిస్తేనే తిరిగి వచ్చి ఓటు వేస్తానని ప్రకటించారు.
ఓటు వేసేందుకు శనివారం సాయంత్రం తాడేపల్లి నుంచి పులివెందులకు చేరుకున్న జగన్.. ఆదివారం పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. అయితే పలు కేంద్రాల్లో వైసీపీ ఏజెంట్లను కూర్చోనివ్వడం లేదని పార్టీ శ్రేణులు ఆయన దృష్టికి తీసుకెళ్లాయి. పులివెందుల పరిధిలోని 80 పోలింగ్ కేంద్రాలకు గాను 70 చోట్ల వైసీపీ ఏజెంట్లు లేరని వారు ఆరోపించారు.
దీంతో జగన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా, లోపలికి అనుమతించలేదని వైసీపీ వర్గాలు తెలిపాయి. అనంతరం బయటకు వచ్చిన అధికారులతో ఆయన మాట్లాడారు. ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని, తమ ఏజెంట్లను అడ్డుకున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తన అనుచరులతో కలిసి ఆర్వో కార్యాలయం ఎదుట గంటకు పైగా బైఠాయించి నిరసన తెలిపారు.
అనంతరం తన నివాసానికి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓటు వేస్తారని భావించినప్పటికీ, ఎన్నికల నిర్వహణపై నిరసనగా ఓటు హక్కును వినియోగించుకోలేదు. పులివెందులలో రీపోలింగ్ నిర్వహించినప్పుడే తిరిగి వచ్చి ఓటు వేస్తానని జగన్ మీడియాకు వెల్లడించారు.
