నగరంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయానికి నివాళులర్పించారు. పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఆయన పార్థివదేహం వద్ద పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బాలసుబ్రహ్మణ్యం మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. పదవీ విరమణ చేసిన రెండు నెలలకే ఆయన కన్నుమూయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్‌తో పోరాడుతూనే చికిత్స తీసుకుంటూ విధులకు హాజరయ్యారని గుర్తుచేసుకున్నారు.

ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించేవారని ఆయనతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో బాలసుబ్రహ్మణ్యం ఎంతో మానసిక వేదనకు గురయ్యారని చంద్రబాబు పేర్కొన్నారు. అప్పట్లో తాము ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పలు సూచనలు ఇచ్చేవారని గుర్తుచేశారు.

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టాలని కోరిన వెంటనే ఆయనకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో బాలసుబ్రహ్మణ్యం కీలక సేవలందించారని సీఎం కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానంపై ఎంతో ఆసక్తి కలిగిన ఆయన రవాణా శాఖ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని చెప్పారు.

ఏ శాఖలో పనిచేసినా నీతి నిజాయితీతో తనదైన ముద్ర వేశారని ప్రశంసించారు. పదవీ విరమణ అనంతరం కూడా ఆయన కోరిన సహాయాన్ని అందించినట్లు వెల్లడించారు. బాలసుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులకు మరోసారి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

By Rajini