
హైదరాబాద్–పుణె–ముంబయి నగరాలను కలుపుతూ ప్రతిపాదించిన బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా వికారాబాద్ జిల్లా అనంతగిరిలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసే అంశం చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నాయి. బుల్లెట్ రైలు మార్గానికి అనువైన భౌగోళిక పరిస్థితులు, ఇతర సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాయి.
ప్రస్తుతం వికారాబాద్ నుంచి రైలులో ముంబయికి చేరుకోవడానికి సుమారు 10 నుంచి 15 గంటల సమయం పడుతోంది. ప్రతిపాదిత బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఈ ప్రయాణ సమయం దాదాపు మూడు గంటలకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే వికారాబాద్ జిల్లాకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పర్యాటక రంగం, ఆర్థిక కార్యకలాపాలకు కూడా ప్రోత్సాహం లభించనుంది. ముఖ్యంగా అనంతగిరి పర్యాటక ప్రాంతానికి మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. అయితే బుల్లెట్ రైలు తుది మార్గం, స్టేషన్ ఏర్పాటు, భూసేకరణకు సంబంధించిన వివరాలపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
హైదరాబాద్ నుంచి ముంబయికి ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో బుల్లెట్ రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్–పుణె–ముంబయి నగరాలను అనుసంధానించే ఈ హైస్పీడ్ రైలు మార్గంలో తెలంగాణలోని వికారాబాద్ జిల్లా అనంతగిరి ప్రాంతంలో స్టేషన్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే మూడు ప్రధాన నగరాల మధ్య ప్రయాణం మరింత వేగంగా, సౌకర్యవంతంగా మారనుంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమై చర్చించారు. అనంతగిరిలో హైస్పీడ్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంత పర్యాటక రంగానికి ప్రోత్సాహం కల్పించడంతో పాటు హైదరాబాద్ ఐటీ కారిడార్‌తో మెరుగైన రవాణా అనుసంధానం ఏర్పడేలా చూడాలన్నది ప్రతిపాదనలో ప్రధాన ఉద్దేశంగా ఉంది.
ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే వికారాబాద్ జిల్లా అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడటంతో పాటు హైదరాబాద్ నుంచి పుణె, ముంబయి నగరాలకు ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. అయితే ప్రాజెక్టుకు సంబంధించిన తుది నిర్ణయాలు, మార్గం, స్టేషన్ ఏర్పాటుపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ప్రాంతంలో ప్రస్తుతం ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నాయి. సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన ఉపగ్రహ పటాల ఆధారంగా ప్రతిపాదిత రైల్వే మార్గానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మార్గంలో కొండలు, గుట్టలు, ఇతర భౌగోళిక అడ్డంకులు ఎక్కడెక్కడ ఉన్నాయి? రైల్వే ట్రాక్ నిర్మాణానికి ఏ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది? అనే అంశాలపై అధ్యయనం చేస్తున్నారు.
ఇప్పటికే పెద్దమంగళారం వరకు సర్వే చేపట్టి, కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక హద్దులు ఏర్పాటు చేసినట్లు స్థానిక రైతులు వెల్లడిస్తున్నారు. అనంతగిరి సమీపంలోని కొంపల్లి, మదన్‌పల్లి తదితర గ్రామాల మీదుగా బుల్లెట్ రైలు మార్గం వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
అయితే వికారాబాద్ జిల్లాలో భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు అందలేదని అదనపు కలెక్టర్ వెంకటాచారి స్పష్టం చేశారు. మరోవైపు గూగుల్ మ్యాప్స్‌లో ఇప్పటికే మార్గానికి సంబంధించిన మార్కింగ్ పనులు పూర్తయినట్లు రైతులు చెబుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై స్థానికంగా ఆసక్తి నెలకొంది. అయితే ప్రతిపాదిత రైల్వే మార్గం ఎక్కడి నుంచి వెళ్తుంది? స్టేషన్లు ఎక్కడ ఏర్పాటు చేస్తారు? భూసేకరణ ఎప్పుడు ప్రారంభమవుతుంది? అనే అంశాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
వికారాబాద్, తాండూరు, కొడంగల్ ప్రాంతాల నుంచి ఉపాధి, వ్యాపార అవసరాల నిమిత్తం ప్రతిరోజూ వందలాది మంది ముంబయికి ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి బయలుదేరే పలు రైళ్లు బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు మీదుగా ముంబయికి చేరుకుంటున్నాయి. సాధారణంగా ఈ మార్గంలో రోజుకు నాలుగు రైళ్లు అందుబాటులో ఉండగా, ఆదివారం, శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో మరో వారాంతపు రైలు కూడా నడుస్తోంది. జనరల్ బోగీలో ప్రయాణించేందుకు సుమారు రూ.413 నుంచి రూ.450 వరకు టికెట్ ధర ఉంది. ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ, ఉపాధి అవసరాలు అధికంగా ఉండటంతో ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
ప్రస్తుతం వికారాబాద్ నుంచి ముంబయికి చేరుకోవడానికి రైలు సర్వీసును బట్టి సుమారు 10 నుంచి 15 గంటల సమయం పడుతోంది. చేవెళ్ల నుంచి పూడూరు వరకు ఉన్న పలు గ్రామాలు, తండాల ప్రజలు ముంబయి వెళ్లేందుకు వికారాబాద్ రైల్వే స్టేషన్‌కు వస్తుంటారు. అదేవిధంగా కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, పరిగి ప్రాంతాల ప్రయాణికులు తాండూరు రైల్వే స్టేషన్‌ను వినియోగించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రతిపాదిత బుల్లెట్ రైలు ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి ముంబయికి కేవలం మూడు గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతో పాటు వ్యాపార, ఉద్యోగ, పర్యాటక రంగాలకు మరింత ఊతం లభించనుంది.
ముఖ్యంగా అనంతగిరి పర్యాటక ప్రాంతానికి హైస్పీడ్ రైలు అనుసంధానం కల్పిస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తద్వారా వికారాబాద్ జిల్లాలో పర్యాటక రంగంతో పాటు స్థానిక వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే వీలుంది. బుల్లెట్ రైలు ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకోనున్నాయి.
