
ఆంధ్రప్రదేశ్లో మురసు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో మొత్తం 30,661 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ముఖ్యంగా కృష్ణా, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో పంట నష్టం అధికంగా నమోదైనట్లు గుర్తించారు. వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలోని 15 జిల్లాల పరిధిలో 132 మండలాల్లో సాధారణ స్థాయికి మించి తుఫాన్ ప్రభావం కనిపించినట్లు అంచనా వేశారు. తుఫాన్ తీరం దాటే సమయంలో మార్కాపురం జిల్లా డోర్నాల వద్ద గంటకు 107 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం విస్తృతంగా సహాయక చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా 10,805 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మొత్తం 171 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు 14,810 ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. సహాయక చర్యల కోసం 11 ఎన్డీఆర్ఎఫ్, 13 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. విద్యుత్ అంతరాయాలు ఏర్పడిన ప్రాంతాల్లో వినియోగించేందుకు 613 జనరేటర్లను సిద్ధం చేశారు.
తుఫాన్ కారణంగా నేలకొరిగిన చెట్లను తొలగించడం, రహదారులపై నిలిచిన వర్షపు నీటిని తొలగించడం కోసం అగ్నిమాపక సిబ్బందిని మోహరించారు. చెట్ల తొలగింపు పనుల కోసం ప్రత్యేకంగా 185 బృందాలను సిద్ధంగా ఉంచారు. మరోవైపు తుఫాన్ ముప్పును ముందుగానే గుర్తించి గర్భిణులు, బాలింతలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మొత్తం 3,066 మంది గర్భిణులు, 1,008 మంది బాలింతలను ముందస్తుగా సురక్షిత ఆసుపత్రులకు చేర్చారు. వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా 13 జిల్లాల్లో 725 వైద్య బృందాలను వైద్య ఆరోగ్యశాఖ అందుబాటులో ఉంచింది. అత్యవసర సేవల కోసం 362 అంబులెన్సులను సిద్ధం చేసింది. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు 3.77 కోట్ల మొబైల్ ఫోన్లకు తుఫాన్ హెచ్చరికల సందేశాలను నిరంతరం పంపించారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం అందించేందుకు ఆర్టీజీఎస్ ఆధ్వర్యంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. తుఫాన్ సమయంలో ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించడంతో పాటు బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టింది.
