
విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. మేయర్‌గా ముక్కా శ్రావణి 2.44 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జీవీఎంసీ పరిధిలోని మొత్తం 120 వార్డులకు గానూ కూటమి అభ్యర్థులు 98 స్థానాల్లో గెలుపొందారు. మేయర్‌తో పాటు కార్పొరేటర్ల ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
కూటమిలో భాగస్వాములుగా ఉన్న జనసేన, బీజేపీల్లో ఏదో ఒక పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి దక్కే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ పదవి కోసం ఎవరెవరు పోటీలో ఉన్నారు? ఎవరికి అవకాశం లభించనుంది? అనే అంశాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)పై కూటమి జెండా ఎగురవేసింది. కూటమి తరఫున మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ముక్కా శ్రావణి 2.44 లక్షల భారీ మెజార్టీతో విజయం సాధించారు. మేయర్ పదవికి మొత్తం 15 మంది పోటీ పడగా, ప్రధాన పోటీ కూటమి, వైఎస్సార్సీపీ మధ్య కొనసాగింది.
జీవీఎంసీ పరిధిలోని మొత్తం 120 డివిజన్లలో టీడీపీ 64, జనసేన 26, బీజేపీ 8 స్థానాలను గెలుచుకున్నాయి. దీంతో కూటమి మొత్తం 98 డివిజన్లను తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు వైఎస్సార్సీపీ 13, స్వతంత్ర అభ్యర్థులు 8, సీపీఎం ఒక డివిజన్లో విజయం సాధించారు.
తనను మేయర్‌గా ఎన్నుకున్న విశాఖపట్నం ప్రజలకు, కూటమి అభ్యర్థులకు విజయాన్ని అందించిన ఓటర్లకు ముక్కా శ్రావణి కృతజ్ఞతలు తెలిపారు. తన కుటుంబం గత 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతోందని, ఆ అనుబంధం కారణంగానే తనకు ఈ అవకాశం లభించిందని పేర్కొన్నారు. కూటమి పార్టీలకు చెందిన అనుభవజ్ఞులైన నాయకులు, కార్పొరేటర్ల సహకారంతో విశాఖపట్నాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని ఆమె స్పష్టం చేశారు.
ముక్కా శ్రావణి తండ్రి ముత్యాలనాయుడు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. గతంలో ఆయన కార్పొరేటర్‌గా కూడా పనిచేశారు. వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్ట్ అయిన శ్రావణి, 2015 నుంచి టీడీపీలో చురుకుగా పనిచేస్తూ రాజకీయాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. 2021 జీవీఎంసీ ఎన్నికల్లో అక్కయ్యపాలెం పరిధిలోని 26వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి విజయం సాధించారు.
తన డివిజన్లో అభివృద్ధి పనులు చేపట్టడంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో గతంలో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. ఇటీవల మేయర్ అభ్యర్థిగా ఆమె పేరు ప్రకటించిన తర్వాత ఆ వీడియో మరోసారి చర్చనీయాంశమైంది. ఆ వీడియోలో ‘ఏదో ఒకరోజు మనకూ సమయం వస్తుంది’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారాయి. తాజాగా మేయర్‌గా ఎన్నిక కావడంతో అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
మరోవైపు కూటమి పార్టీల మధ్య పొత్తు, సీట్ల సర్దుబాటు ప్రక్రియలో కొంత గందరగోళం నెలకొంది. మొత్తం 120 వార్డుల్లో 246 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. కూటమి పార్టీల్లోనూ సీట్లు దక్కని పలువురు నేతలు రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు.
విజయం సాధించిన రెబల్ అభ్యర్థుల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం 36వ వార్డు నుంచి జనసేన రెబల్ కొల్లి సింహాచలం, అగనంపూడి జోన్ 106వ వార్డు నుంచి జనసేన రెబల్ రామునాయుడు ఉన్నారు. అలాగే విశాఖ పశ్చిమ నియోజకవర్గం 73వ వార్డులో జనసేన రెబల్ పెతకంశెట్టి శ్యాం సుధాకర్‌రావు గెలుపొందారు. టీడీపీ రెబల్స్ విషయానికి వస్తే 39వ వార్డులో బత్తిన నవీన్, 41వ వార్డులో పంపాన రాజ్యలక్ష్మి, పెందుర్తి పరిధిలోని 118వ వార్డులో గంట్ల లక్ష్మి, గాజువాక 86వ వార్డులో కాకి గోవిందరెడ్డి విజయం సాధించారు.
కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాల సమయంలో నెలకొన్న అసంతృప్తి, అంతర్గత పోటీలు ఎన్నికల ఫలితాల్లోనూ ప్రతిబింబించాయి. అధికారిక పార్టీల అభ్యర్థులతో పాటు రెబల్ అభ్యర్థులు కూడా గెలుపొందడం జీవీఎంసీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.
విశాఖపట్నం జీవీఎంసీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల దృష్టి డిప్యూటీ మేయర్ పదవిపై పడింది. ఈ పదవిని కూటమిలోని ఏ పార్టీకి కేటాయిస్తారనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రధానంగా డిప్యూటీ మేయర్ రేసులో విశాఖపట్నం జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరుశరామరాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన 54వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. కూటమి పార్టీల మధ్య కుదిరిన పొత్తు, సీట్ల సర్దుబాటులో భాగంగా ఆయనకు డిప్యూటీ మేయర్ పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఈ పదవిని జనసేన పార్టీకి కేటాయిస్తే, విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలోని 40వ డివిజన్ నుంచి గెలుపొందిన భీశెట్టి వసంత లక్ష్మి పేరు తెరపైకి వస్తోంది. ఆమెకు అవకాశం కల్పించే అంశాన్ని కూడా పార్టీ వర్గాలు పరిశీలిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే డిప్యూటీ మేయర్ పదవిపై నెలకొన్న ఉత్కంఠకు ఒకటి, రెండు రోజుల్లో తెరపడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై స్పష్టత రానుంది.
