హైదరాబాద్‌ క్యూర్‌ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో 7.6 లక్షల వీధిదీపాల నిర్వహణ బాధ్యతలను పదేళ్లపాటు ప్రైవేట్‌ సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం రూ.1,720.83 కోట్లతో అనుమతులు మంజూరు చేసింది. ఈ ఏడాది డిసెంబరు నుంచి ఎంపికైన గుత్తేదారు సంస్థ నిర్వహణ బాధ్యతలను చేపట్టనుంది. ప్రతిరోజూ కనీసం 98 శాతం వీధిలైట్లు వెలిగేలా చూడాలనే నిబంధనను విధించారు. ఈ నిర్వహణ పనుల నాణ్యత, సంస్థ పనితీరును ఉస్మానియా విశ్వవిద్యాలయం పర్యవేక్షించనుంది. అలాగే ప్రస్తుతం ఉన్న పాత బల్బుల స్థానంలో అధిక వాటేజీ కలిగిన ఆధునిక వీధిలైట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలు గత రెండేళ్లుగా ఎదుర్కొంటున్న వీధిలైట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) పరిధిలోని మూడు నగరపాలక సంస్థల్లో వీధి దీపాల నిర్వహణ కోసం పదేళ్ల కాలపరిమితితో రూ.1,720.83 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వీధిలైట్ల నిర్వహణ, మరమ్మతులు, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం వంటి బాధ్యతలను ఒకే సంస్థకు అప్పగించి, నగరంలోని రహదారులపై వెలుతురు సమస్యను సమర్థంగా పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే సుమారు 7.6 లక్షల వీధి దీపాల నిర్వహణ వ్యవస్థలో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి.

వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం 2026 మార్చి 6న రూ.1,341.60 కోట్ల అంచనా వ్యయంతో తొలుత అనుమతులు మంజూరు చేసింది. అయితే టెండర్ల ప్రక్రియలో పాల్గొన్న సంస్థలు ప్రభుత్వ అంచనాల కంటే అధిక ధరలను ప్రతిపాదించాయి. బీఏసీ ఇన్‌ఫ్రాటెక్‌–విన్సీ గ్లోబల్‌ జాయింట్‌ వెంచర్‌ ఒక్కో వీధిలైటు నిర్వహణకు నెలకు రూ.153.60 చొప్పున కోట్‌ చేసింది. ఇది నిర్ణయించిన బెంచ్‌మార్క్‌ ధర కంటే 4.49 శాతం అధికం. మరోవైపు బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌–మ్యాట్రిక్స్‌ మీటర్స్‌ కన్సార్టియం రూ.153.90 ధరను ప్రతిపాదించగా, ఇది బెంచ్‌మార్క్‌ కంటే 4.69 శాతం ఎక్కువగా ఉంది. రెండు సంస్థల ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం తక్కువ ధరను కోట్‌ చేసిన బీఏసీ ఇన్‌ఫ్రాటెక్‌–విన్సీ గ్లోబల్‌ జాయింట్‌ వెంచర్‌కు పనులు అప్పగించాలని నిర్ణయించింది. పెరిగిన టెండరు ధరలకు అనుగుణంగా ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని రూ.1,720.83 కోట్లకు సవరించి తాజా పరిపాలనా అనుమతులు జారీ చేసింది.

టెండరు నిబంధనల ప్రకారం నవంబరు నెలాఖరులోగా ఒప్పందాలు సహా ఇతర అధికారిక ప్రక్రియలను పూర్తి చేయనున్నారు. అనంతరం డిసెంబరు నుంచి ఎంపికైన సంస్థ వీధిలైట్ల నిర్వహణ బాధ్యతలను చేపట్టనుంది. తొలుత మూడు కార్పొరేషన్లకు ప్రత్యేకంగా డ్యాష్‌బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియను మొదటి మూడు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆరు నెలల్లో మూడు కార్పొరేషన్ల పరిధిలోని అన్ని వీధిలైట్లను కంట్రోల్‌ యూనిట్లకు అనుసంధానించి, డ్యాష్‌బోర్డుతో లింక్‌ చేయనున్నారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రతిరోజూ కనీసం 98 శాతం వీధిలైట్లు తప్పనిసరిగా వెలిగేలా నిబంధన విధించారు. ప్రతి కార్పొరేషన్‌ పరిధిలో పనిచేస్తున్న వీధిలైట్ల శాతాన్ని లెక్కించిన తర్వాతే గుత్తేదారు సంస్థకు బిల్లులు చెల్లించనున్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు లైట్లు పనిచేయకపోతే చెల్లింపులపై ప్రభావం పడనుంది. గుత్తేదారు సంస్థ పనితీరును నిష్పక్షపాతంగా అంచనా వేసేందుకు స్వతంత్ర పర్యవేక్షణ సంస్థగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి బాధ్యతలు అప్పగించారు.

డిసెంబరు నుంచి వీధిలైట్లు వెలగకపోతే వాటికి మరమ్మతులు చేయించడం, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించడం, నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించడం వంటి బాధ్యతలన్నీ ఎంపికైన గుత్తేదారు సంస్థే నిర్వహించనుంది. ఈ విధానం ద్వారా వీధిలైట్ల నిర్వహణలో జాప్యాన్ని తగ్గించి, నగరవ్యాప్తంగా నిరంతర వెలుతురు ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.

నగరంలోని వీధుల్లో మెరుగైన వెలుతురు అందించేందుకు ప్రస్తుతం ఉన్న పాత బల్బుల స్థానంలో అధిక వాటేజీ కలిగిన కొత్త లైట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 18 వాట్ల బల్బుల స్థానంలో 25 వాట్ల లైట్లు, 35 వాట్ల బల్బులకు బదులుగా 40 వాట్ల లైట్లను అమర్చనున్నారు. అలాగే 70 వాట్ల లైట్ల స్థానంలో 65 నుంచి 90 వాట్ల సామర్థ్యం కలిగిన లైట్లను, 110 వాట్ల స్థానంలో 90 నుంచి 120 వాట్ల సామర్థ్యం ఉన్న లైట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ వివరాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ వెల్లడించారు.

కొత్త నిర్వహణ విధానం అమల్లోకి రావడంతో వీధిలైట్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు అవకాశం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. పదేళ్లపాటు కొనసాగనున్న ఈ ప్రాజెక్టు ద్వారా కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) పరిధిలోని మూడు కార్పొరేషన్లలో రాత్రివేళల్లో వెలుతురు సమస్యలను తగ్గించి, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.