
మురసు తుపాను ప్రభావంతో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరు ఇళ్లు, దుకాణాల్లోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో పలువురు ప్రాణభయంతో భవనాల పైకప్పులపైకి చేరుకుంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
మరోవైపు ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం సమీపంలో జంగారెడ్డిగూడెం–అశ్వారావుపేట ప్రధాన రహదారికి భారీ వరదల కారణంగా గండి పడింది. వరద ప్రవాహానికి రహదారి కొంతభాగం కోతకు గురికావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇక ఎన్టీఆర్ జిల్లాలోనూ భారీ వర్షాలు, వరదల ప్రభావం వ్యవసాయ రంగంపై పడింది. పంట పొలాలు నీట మునగడంతో పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మురసు తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమవుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలకు ప్రధాన రహదారులు సైతం నీటమునగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు.. ప్రజలు బెంబేలు!
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో భారీ వర్షాలు తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరు ఇళ్లు, దుకాణాల్లోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ఇళ్లు, షాపులు పూర్తిగా నీట మునగడంతో ప్రాణభయంతో ప్రజలు భవనాల పైకప్పులపైకి చేరుకుంటున్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
వరద పరిస్థితిపై అధికారులకు సమాచారం అందించినప్పటికీ, ఇప్పటివరకు సహాయక బృందాలు తమ వద్దకు చేరుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహాయక చర్యలు ప్రారంభం కాకపోవడంతో బాధితుల్లో ఆందోళన మరింత పెరిగింది. మరోవైపు మార్కెట్ యార్డు ప్రాంతంలోని రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. భారీగా ప్రవహిస్తున్న వరద నీటికి వాహనాలు, పశువులు కొట్టుకుపోయినట్లు సమాచారం.
ఏలూరు జిల్లాలోనూ వరద బీభత్సం!
ఏలూరు జిల్లాలోనూ భారీ వర్షాలు, వరదలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం సమీపంలో జంగారెడ్డిగూడెం–అశ్వారావుపేట ప్రధాన రహదారి వరద ఉద్ధృతికి కోతకు గురై గండి పడింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఫలితంగా ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఏలూరు ఏజెన్సీ ప్రాంతాల్లో వరద ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. బుట్టాయిగూడెం మండలంలో కొండవాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తూ పొంగిపొర్లుతున్నాయి. విప్పలపాడు సమీపంలో జాతీయ రహదారిపై వరద ప్రవాహానికి నిర్మాణంలో ఉన్న కట్టడాలు కొట్టుకుపోయాయి. వరుస వర్షాలు, పెరుగుతున్న వరద ఉద్ధృతితో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో రాకపోకలు బంద్.. 20 గ్రామాలకు నిలిచిన రాకపోకలు!
ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. తిరువూరు నియోజకవర్గంలో వర్షాల తీవ్రత అధికంగా ఉండగా, అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గంపలగూడెం మండలంలోని వినగడప, తోటమూల గ్రామాల మధ్య కట్టలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో సుమారు 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
దీంతో సమీపంలోని రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించాలన్నా చుట్టూ తిరిగి దాదాపు 30 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు భారీ గాలులు, వర్షాల ధాటికి పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. గంపలగూడెం మండలం అనుమల్లంకలో వరి పంట పూర్తిగా నేలకొరిగింది. చేతికొచ్చే దశలో ఉన్న పంట దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు!
గుంటూరు జిల్లాలోనూ భారీ వర్షాలు, వరదలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పెదనందిపాడు సమీపంలోని నల్లమడ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటి ప్రవాహానికి నల్లమడ వాగు, నక్కవాగులకు గండ్లు పడటంతో పరిసర ప్రాంతాల్లోకి నీరు చేరుతోంది.
పెదనందిపాడు, నాగులపాడు గ్రామాలతో పాటు కాకుమాను మండలంలోని కొమ్మూరు, గార్లపాడు గ్రామాలు వరద నీటిలో చిక్కుకుని జలదిగ్బంధంలో ఉన్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ఉద్ధృతి మరింత పెరిగే ప్రమాదం ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
