
మురసు తుపాను ప్రభావంతో చిలకలూరిపేటలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులపై పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఈ క్రమంలో తిమ్మాపురం అండర్పాస్ వద్ద భారీగా వరద నీరు చేరడంతో ముగ్గురు మహిళలు అందులో చిక్కుకుపోయారు. వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో వారు బయటకు రాలేక సహాయం కోసం ఎదురుచూశారు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట సీఐ సుబ్బానాయుడు తన సిబ్బందితో కలిసి వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రాణాలకు తెగించి వరద నీటిలోకి దిగి ముగ్గురు మహిళలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సమయస్ఫూర్తితో స్పందించి మహిళల ప్రాణాలను కాపాడిన సీఐ, పోలీసు సిబ్బందిపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలపై మురసు తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. వరద నీరు పోటెత్తడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చిలకలూరిపేట సీఐ సుబ్బానాయుడు మానవత్వం చాటుకున్నారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వరదలో చిక్కుకున్న ముగ్గురు మహిళలను రక్షించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
అసలు ఏం జరిగిందంటే..?
మురసు తుపాను ప్రభావంతో చిలకలూరిపేట పట్టణంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. భారీ వర్షాలకు జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది. మరోవైపు పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగిపడటంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పరిసర ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తిమ్మాపురం అండర్పాస్ వద్ద భారీగా వరద నీరు చేరడంతో ముగ్గురు మహిళలు అందులో చిక్కుకుపోయారు. వరద ప్రవాహం అంతకంతకూ ఉద్ధృతం కావడంతో బయటకు వచ్చే మార్గం లేక వారు ప్రాణభయంతో కేకలు వేశారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించాలనుకున్నప్పటికీ, వరద ప్రవాహం తీవ్రతను చూసి ముందుకు వెళ్లలేకపోయారు. ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురయ్యారు.
సీఐ సాహసం.. వరదలోకి దూకి ముగ్గురి ప్రాణాలు కాపాడిన పోలీస్ అధికారి!
మహిళలు వరదలో చిక్కుకున్నారన్న సమాచారం అందుకున్న చిలకలూరిపేట సీఐ సుబ్బానాయుడు తన సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలాగైనా వారిని సురక్షితంగా బయటకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన నడుముకు తాడు కట్టుకుని, దాని మరో చివరను ఒడ్డున ఉన్న స్థానికులు, పోలీసు సిబ్బందికి గట్టిగా పట్టుకోవాలని సూచించారు. అనంతరం ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలోకి దూకి, ప్రవాహాన్ని ఎదుర్కొంటూ మహిళల వద్దకు చేరుకున్నారు. వారిని తాడు సహాయంతో జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చి సురక్షితంగా రక్షించారు.
సీఐ సుబ్బానాయుడు చూపిన ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తిపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన ఆయనపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులతో పాటు స్థానికులు కూడా ఆయన అంకితభావాన్ని అభినందిస్తూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. విధి నిర్వహణలోనే కాకుండా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనూ పోలీసుల సేవాభావాన్ని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.
