AP MPTC, ZPTC Elections: SEC Anil Chandra Punetha Reviews Polling Arrangements, Says Voting Is Peaceful

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆయన ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లోని పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు.

ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని రైల్వే వాగన్ వర్క్‌షాప్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంతో పాటు విజయవాడ రూరల్ మండలం పాతపాడు, గన్నవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రాలను ఆయన పరిశీలించారు. అక్కడ ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, పోలింగ్‌ నిర్వహణ తీరుపై ఎన్నికల సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన ఓటర్లతో నేరుగా మాట్లాడారు. ఓటు వేసే సమయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా? అని ఆరా తీశారు. అన్ని ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని, ఎలాంటి ఇబ్బందులు లేవని ఓటర్లు, పోలింగ్‌ సిబ్బంది తెలిపినట్లు కమిషనర్‌ వెల్లడించారు.

పోలింగ్‌ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లపై అనిల్ చంద్ర పునేఠ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టిందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల ప్రక్రియలో తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నాయని ఆయన వెల్లడించారు.

For more: MPTC, ZPTC Elections Live Updates in DTV Digital