
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తెలంగాణలో కీలక ముందడుగు వేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 12 ఆటోమేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ట్రాక్‌లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్, కరీంనగర్ నగరాల్లో ఈ డిజిటల్ టెస్ట్ ట్రాక్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే తెలంగాణ రవాణా రంగంలో డిజిటల్ విప్లవానికి నాంది పలకనుంది. ముఖ్యంగా మానవ ప్రమేయం, సిఫార్సులకు తావులేకుండా పారదర్శకంగా డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించేందుకు వీలవుతుంది. అసలు ఈ ఆటోమేటెడ్ టెస్ట్ ట్రాక్‌లు ఎలా పనిచేస్తాయి? డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షల విధానంలో ఎలాంటి మార్పులు రానున్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థల్లో ఒకటైన మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) తెలంగాణ రవాణా శాఖతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షల నిర్వహణను మరింత పారదర్శకంగా, ఆధునికంగా మార్చే లక్ష్యంతో ఆరు ప్రాంతాల్లో మొత్తం 12 ఆటోమేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ట్రాక్‌లను (ADTT) ఏర్పాటు చేయనుంది. రోడ్డు భద్రతను మెరుగుపరచడంతో పాటు డ్రైవింగ్ పరీక్షల్లో మానవ ప్రమేయాన్ని తగ్గించి, అవకతవకలకు తావులేకుండా చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. మారుతీ సుజుకీ సంస్థ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇంతకీ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు అంటే ఏమిటి? ఇవి ఎలా పనిచేస్తాయి? ఈ ప్రాజెక్టులో మారుతీ సుజుకీ పాత్ర ఏమిటి? తెలుసుకుందాం.
తెలంగాణలో 12 ఆటోమేటెడ్ టెస్ట్ ట్రాక్‌లు
తెలంగాణ రవాణా శాఖతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో మొత్తం 12 అధునాతన ఆటోమేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కొండాపూర్‌లలో ఈ ట్రాక్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. మేడ్చల్ జిల్లాలో ఉప్పల్, మేడ్చల్, నాగోల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనుండగా, కరీంనగర్ ఆర్టీఓ కేంద్రం పరిధిలోనూ ఈ ఆధునిక పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ఆటోమేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ట్రాక్ అంటే ఏమిటి?
సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షల సమయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అభ్యర్థి పక్కనే ఉండి, అతడి డ్రైవింగ్ నైపుణ్యాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. అభ్యర్థి వాహనాన్ని ఎలా నడుపుతున్నాడు? ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తున్నాడా? అనే అంశాలను బట్టి పాస్ లేదా ఫెయిల్ అని నిర్ణయిస్తారు. అయితే ఈ సంప్రదాయ విధానంలో మానవ తప్పిదాలు, పక్షపాతం, సిఫార్సులకు అవకాశం ఉండేది.
ఈ సమస్యలకు పరిష్కారంగా అందుబాటులోకి వచ్చిందే ఆటోమేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ట్రాక్ (ADTT). ఇది పూర్తిగా డిజిటల్ విధానంలో పనిచేసే ఆధునిక పరీక్షా వ్యవస్థ. ఇందులో హైటెక్ కెమెరాలు, సెన్సార్లు, కంప్యూటర్ అల్గారిథమ్‌ల సహాయంతో అభ్యర్థి డ్రైవింగ్ సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. పరీక్ష మొత్తం సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా సాగుతుంది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్‌లోని నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ పరీక్షలు నిర్వహిస్తారు.
ఆటోమేటెడ్ టెస్ట్ ట్రాక్‌లు ఎలా పనిచేస్తాయి?
ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లో పరీక్ష ప్రక్రియ అంతా డిజిటల్ పర్యవేక్షణలో జరుగుతుంది. ట్రాక్ పరిసరాల్లో అత్యాధునిక 4K, HD కెమెరాలతో పాటు ప్రత్యేక సెన్సార్లను ఏర్పాటు చేస్తారు. పరీక్షకు వచ్చే వాహనానికి RFID (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) ట్యాగ్‌ను అమర్చుతారు. దీని ద్వారా వాహన కదలికలను సిస్టమ్ గుర్తించి, ప్రతి దశలో అభ్యర్థి డ్రైవింగ్ తీరును రికార్డ్ చేస్తుంది. కెమెరాలు, సెన్సార్ల నుంచి అందిన సమాచారాన్ని కంప్యూటర్ వ్యవస్థ విశ్లేషించి పరీక్ష ఫలితాన్ని నిర్ణయిస్తుంది.
టూ వీలర్ డ్రైవింగ్ పరీక్షలు: ద్విచక్ర వాహనదారుల నైపుణ్యాన్ని పరీక్షించేందుకు 8 ఆకారంలో ట్రాక్, సర్పెంటైన్ (పాము ఆకారపు) ట్రాక్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఎత్తైన ర్యాంప్‌పై వాహనాన్ని నియంత్రిస్తూ నడిపించడం వంటి పరీక్షలు నిర్వహిస్తారు.
ఫోర్ వీలర్ డ్రైవింగ్ పరీక్షలు: నాలుగు చక్రాల వాహనాలకు H ఆకారపు ట్రాక్‌పై ముందుకు, వెనక్కి నడపడం, పారలల్ పార్కింగ్, S ఆకారపు ట్రాక్‌లో డ్రైవింగ్, ఘాట్ రోడ్డు, ర్యాంప్‌పై వాహనాన్ని నియంత్రించడం వంటి అంశాలను పరీక్షిస్తారు.
ఈ పరీక్షల్లో అభ్యర్థి వాహనాన్ని ఎంత సమర్థంగా నియంత్రిస్తున్నాడు? నిర్దేశించిన మార్గాన్ని సరిగ్గా అనుసరిస్తున్నాడా? అనే అంశాలను సాంకేతిక వ్యవస్థ విశ్లేషిస్తుంది. దీంతో డ్రైవింగ్ నైపుణ్యాల ఆధారంగా మరింత పారదర్శకంగా ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంటుంది.
డ్రైవింగ్ పరీక్ష సమయంలో అభ్యర్థి ట్రాక్‌పై ఉన్న సరిహద్దు గీతలను తాకినా, ఇండికేటర్ ఉపయోగించడం మర్చిపోయినా, నిర్దేశించిన సమయం కంటే ఎక్కువ సమయం తీసుకున్నా ఆటోమేటెడ్ సిస్టమ్ వెంటనే గుర్తిస్తుంది. కెమెరాలు, సెన్సార్ల ద్వారా సేకరించిన సమాచారాన్ని కంప్యూటర్ సర్వర్‌కు పంపించి విశ్లేషిస్తాయి. పరీక్ష పూర్తయిన వెంటనే అభ్యర్థి సాధించిన పాయింట్లు, చేసిన పొరపాట్లు, పరీక్షలో చూపిన ప్రతిభకు సంబంధించిన పూర్తి నివేదిక అందుబాటులోకి వస్తుంది. నిర్ణీత అర్హత మార్కులు సాధిస్తే కంప్యూటర్ వ్యవస్థ ఆటోమేటిక్‌గా ‘PASS’గా ఫలితాన్ని ప్రకటించి, డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు ప్రక్రియకు అనుమతిస్తుంది. దీంతో పరీక్షల నిర్వహణలో మానవ ప్రమేయం తగ్గి, పారదర్శకత పెరుగుతుంది.
ఈ ప్రాజెక్టులో మారుతీ సుజుకీ పాత్ర ఏమిటి?
దేశంలోనే ప్రముఖ కార్ల తయారీ, విక్రయ సంస్థగా గుర్తింపు పొందిన మారుతీ సుజుకీ కేవలం వాహనాల తయారీకే పరిమితం కాకుండా రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు కూడా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణలో 12 ఆటోమేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ట్రాక్‌ల ఏర్పాటుకు ముందుకొచ్చింది.
ఈ ప్రాజెక్టును కంపెనీ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా సొంత ఖర్చుతో చేపట్టనుంది. అవసరమైన ఆధునిక ఐటీ మౌలిక సదుపాయాలు, హైటెక్ కెమెరాలు, విజువల్ సిస్టమ్స్, డ్రైవింగ్ పరీక్షలకు సంబంధించిన సాంకేతిక పరికరాలను సమకూర్చి ట్రాక్‌లను నిర్మించనుంది.
తెలంగాణలో ఏర్పాటు చేయనున్న 12 ట్రాక్‌లతో కలిపి మారుతీ సుజుకీ ఇప్పటికే దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తం 98 ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను ఏర్పాటు చేసినట్లు సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 8 ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ (IDTR), 19 రోడ్ సేఫ్టీ నాలెడ్జ్ సెంటర్లను కూడా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా డ్రైవింగ్ నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, సురక్షితమైన డ్రైవింగ్‌పై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.
