తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు విజయ్ సేతుపతి మరో అరుదైన ఘనతను అందుకోబోతున్నారు. ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ వేడుకలో అవార్డులు ప్రదానం చేసే అవకాశం ఆయనకు దక్కింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడిగా విజయ్ సేతుపతి చరిత్ర సృష్టించనున్నారు.

ఇంటర్నేషనల్ ఎమ్మీ వేదికపై విజయ్ సేతుపతి

నవంబర్ 23న అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేడుక జరగనుంది. ఈ కార్యక్రమంలో పలువురు అంతర్జాతీయ ప్రముఖులతో కలిసి విజయ్ సేతుపతి ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నారు. వివిధ విభాగాల్లో విజేతలకు ఆయన అవార్డులు అందించనున్నారు. భారతీయ నటుడికి ఇలాంటి అంతర్జాతీయ వేదికపై ప్రజెంటర్‌గా అవకాశం దక్కడం విశేషంగా మారింది.

2024లో భారతీయ నటుడు, స్టాండప్ కమెడియన్ వీర్ దాస్ ఈ అవార్డుల వేడుకకు హోస్ట్‌గా వ్యవహరించారు. ఇప్పుడు విజయ్ సేతుపతి ప్రజెంటర్‌గా పాల్గొంటుండటంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాలతోనూ బిజీగా..

ఇక సినిమాల విషయానికొస్తే.. విజయ్ సేతుపతి ఇటీవల ‘బత్తా’ చిత్రంలో కనిపించారు. విభిన్నమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయనకు ఈ అంతర్జాతీయ గుర్తింపు మరో ప్రత్యేకమైన మైలురాయిగా నిలవనుంది. మరోవైపు ఆయన నటించిన విజయవంతమైన చిత్రం ‘మహారాజా’ను హాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.