ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దేవరపల్లి మండలానికి చెందిన జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్య (23) అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందారు. చిన్న వయసులోనే ఆమె మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గారపాటి దివ్య జనసేన పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. గురువారం పోలింగ్ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం ఆమె అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స అందించిన అనంతరం గురువారం రాత్రి ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. అయితే శుక్రవారం ఉదయం మరోసారి అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు తిరిగి రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.

ఇద్దరు చిన్నారులను వదిలి వెళ్లిన దివ్య

గారపాటి దివ్యకు నాలుగు నెలల క్రితమే ఓ బాబు జన్మించాడు. అంతకుముందు ఆమెకు మరో కుమారుడు కూడా ఉన్నాడు. ఇద్దరు చిన్నారులను వదిలి ఆమె కన్నుమూయడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

https://dtvandhrapradesh.com

దివ్య మృతితో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యువ అభ్యర్థి అకాల మరణ వార్తతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.