ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పలు జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేసినట్లు ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లకుండా తమ నేతలను అడ్డుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎంపీ తలారి రంగయ్యలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం. కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది.

నంద్యాల జిల్లాలోనూ పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులపై పోలీసులు ఆంక్షలు విధించారు. శిల్పా చక్రపాణి, శిల్పా రవిని పోలీసులు అడ్డుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలాగే కర్నూలు జిల్లాలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని గృహ నిర్బంధం చేసి నందికొట్కూరుకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఆత్మకూరులో శిల్పా భువనేశ్వర్‌రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం.

కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డంకులు?

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు సమయంలో తమ పార్టీ నాయకులను కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లనివ్వకుండా అడ్డుకోవడంపై వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడేందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారుల వివరణ వెలువడాల్సి ఉంది.

నందికొట్కూరులో మీడియాకు అనుమతి నిరాకరణ

నంద్యాల జిల్లా నందికొట్కూరు కౌంటింగ్ కేంద్రం వద్ద మరో వివాదం చోటుచేసుకుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం ప్రధాన గేటు వద్దే మీడియా ప్రతినిధులను పోలీసులు నిలిపివేశారు. కౌంటింగ్ కేంద్రం సమీపంలోకి వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు.

https://dtvandhrapradesh.com

మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించకపోవడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.