
D Spiritual: Nov 7: సింహాచలం ఆలయంలో కొత్త డ్రెస్ కోడ్.. భక్తులకు కీలక సూచనలు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తుల కోసం నూతన వస్త్ర నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఆలయ సంప్రదాయాలు, పవిత్రతను గౌరవిస్తూ భక్తులు ఇకపై నిర్దేశించిన వస్త్రధారణతోనే స్వామివారిని దర్శించుకోవాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) జల్లేపల్లి వెంకట్రావు స్పష్టం చేశారు.
కొత్త డ్రెస్ కోడ్ ప్రకారం పురుషులు పంచె-కండువా లేదా కుర్తా-పైజామా ధరించి ఆలయానికి రావాలి. అయితే ఫార్మల్ ప్యాంట్, షర్ట్ ధరించిన వారికి కూడా దర్శనానికి అనుమతి ఉంటుంది. మహిళలు చీర, లంగా-ఓణీ లేదా చుడీదార్ ధరించాల్సి ఉంటుంది. చుడీదార్ ధరించే వారు తప్పనిసరిగా దుపట్టా వేసుకోవాలని అధికారులు సూచించారు.
మరోవైపు షార్ట్స్ (నిక్కర్లు), టీ-షర్టులు, స్లీవ్‌లెస్ టాప్స్ వంటి ఆధునిక పాశ్చాత్య దుస్తులు ధరించి వచ్చే భక్తులను ఆలయ ప్రాంగణంలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. సాధారణ దర్శనానికి వచ్చే వారితో పాటు ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు కూడా ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
ఆలయ పవిత్రతను పరిరక్షించడంతో పాటు సనాతన ధర్మ సంప్రదాయాలను కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో జల్లేపల్లి వెంకట్రావు వెల్లడించారు. నూతన నిబంధనలపై భక్తులకు ముందస్తు అవగాహన కల్పించేందుకు దేవస్థానం తరఫున విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, నవంబర్ 8, ఆదివారం నరక చతుర్దశి, స్వాతి నక్షత్రం సందర్భంగా సింహాచలం ఆలయంలో ప్రత్యేక హోమాలు నిర్వహించనున్నారు. ఈ పూజా కార్యక్రమాల నేపథ్యంలో ఆరోజు భక్తులకు స్వామివారి దర్శన సౌకర్యం సాయంత్రం 6 గంటల వరకే అందుబాటులో ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులు ఈ మార్పును గమనించి, ముందుగానే తమ దర్శన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
