
పల్నాడు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి గ్రామంలో ఓటర్లు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఓట్లతోపాటు గ్రామ సమస్యలను వివరిస్తూ రాసిన స్లిప్పులను కూడా బ్యాలెట్ బాక్సుల్లో వేశారు.
కంకణాలపల్లి గ్రామానికి రైల్వే అండర్‌పాస్ కాకుండా ఫ్లైఓవర్ నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రతిపాదిత రైల్వే అండర్‌పాస్ వల్ల స్థానికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్న గ్రామస్తులు.. తమ అభ్యంతరాలను ఓటర్ స్లిప్పులపై రాసి బ్యాలెట్ బాక్సుల్లో వేశారు.
ఎన్నికల పోలింగ్ సమయంలోనే గ్రామానికి సంబంధించిన రైల్వే బ్రిడ్జి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈ స్లిప్పులను బాక్సుల్లో వేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన సమయంలో బ్యాలెట్ బాక్సుల్లో ఈ స్లిప్పులు బయటపడటంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
తమ గ్రామ సమస్యను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కంకణాలపల్లి వాసులు చేసిన ఈ ప్రయత్నం ఆసక్తిని రేకెత్తిస్తోంది. గ్రామస్థుల విజ్ఞప్తిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
