Dnews nov:7చాలామంది తమకు సిగరెట్ తాగే అలవాటు లేదని, కాబట్టి పొగాకు వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని భావిస్తుంటారు. కానీ సిగరెట్ తాగకపోయినా, ఇతరులు వదిలే పొగను పీల్చడం వల్ల కూడా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, ఇతర తీవ్రమైన వ్యాధులకు ప్యాసివ్ స్మోకింగ్ కూడా ఒక ప్రధాన కారణమవుతోంది. అసలు ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఏమిటి? ఇది ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? దీని వల్ల కలిగే ప్రమాదాల గురించి వైద్యులు ఏమంటున్నారు? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

సిగరెట్ తాగే అలవాటు లేకపోయినా.. పక్కనే ఎవరైనా పొగ తాగితే ఆ ప్రభావం మన ఆరోగ్యంపై పడక తప్పదు. ఇతరులు వదిలే సిగరెట్ పొగను పీల్చడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను ప్యాసివ్ స్మోకింగ్ లేదా సెకండ్‌హ్యాండ్ స్మోకింగ్ అంటారు. ఈ పరోక్ష ధూమపానం కారణంగా పొగ తాగని వారు సైతం గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధిస్తూ చట్టాలు ఉన్నప్పటికీ, వాటి అమలులో నిర్లక్ష్యం కారణంగా సమస్య తీవ్రత పెరుగుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసిన ఓ ఘటన ప్యాసివ్ స్మోకింగ్ ప్రమాదాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది. చిగురుమామిడి మండలానికి చెందిన ఓ వ్యక్తికి సిగరెట్ తాగే అలవాటు అసలే లేదు. అయినప్పటికీ గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. వైద్యులు పరీక్షల సమయంలో ధూమపానం అలవాటు ఉందా అని ప్రశ్నించగా.. లేదని సమాధానమిచ్చాడు. అయితే ఆయన నిర్వహిస్తున్న దుకాణానికి వచ్చే పలువురు వినియోగదారులు అక్కడే సిగరెట్లు తాగేవారు. దీంతో వారి నుంచి వెలువడే పొగను సుదీర్ఘకాలంగా పీల్చడం ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇలాంటి బాధితులు వివిధ ఆసుపత్రులకు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

చిన్నారులు, గర్భిణులకు మరింత ప్రమాదం

ప్యాసివ్ స్మోకింగ్ ప్రభావం ఒక్క వ్యక్తికే పరిమితం కావడం లేదు. ఇంట్లో ఒకరు ధూమపానం చేసినా మిగతా కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా గర్భిణులు, చిన్నారులు సెకండ్‌హ్యాండ్ స్మోకింగ్‌కు గురైతే తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నారుల్లో శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు.

పొగ తాగే అలవాటు లేని వారిలోనూ ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీర్ఘకాలం పాటు ఇతరుల సిగరెట్ పొగకు గురికావడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు కూడా పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిషేధం కాగితాలకే పరిమితమా?

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడంపై నిషేధం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడం, కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నా.. అధికారులు కఠినంగా వ్యవహరించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా కొందరు బహిరంగంగానే సిగరెట్లు తాగుతున్నారు. మరికొందరు బైక్‌లపై ప్రయాణిస్తూ కూడా ధూమపానం చేస్తుండటంతో వెనుక వచ్చే వాహనదారులు, పాదచారులు పొగతో ఇబ్బందులు పడుతున్నారు.

కొన్ని ప్రాంతాల్లో ఒకేచోట 20 నుంచి 30 మంది వరకు సిగరెట్లు తాగుతుండటంతో పరిసర ప్రాంతాలన్నీ పొగతో నిండిపోతున్నాయి. టీ దుకాణాలు, హోటళ్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడికి వచ్చే వినియోగదారులతో పాటు సమీపంలో నివసించే వారు, పనిచేసే వారు కూడా పరోక్ష ధూమపానం బారిన పడుతున్నారు.

పొగ తాగనివారికే శిక్షా?

సిగరెట్ తాగే అలవాటు లేకున్నా ఇతరుల నిర్లక్ష్యం కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీ తాగేందుకు, టిఫిన్ చేసేందుకు దుకాణాలకు వెళ్లినా కొందరు అక్కడే సిగరెట్లు తాగుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. తమకు సంబంధం లేని అలవాటు కారణంగా ఆరోగ్యం దెబ్బతిని ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు.

మరోవైపు ప్యాసివ్ స్మోకింగ్ కారణంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులకు వచ్చే వారి పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. ధూమపానం చేసేవారితో పాటు వారి చుట్టూ ఉండే వారు కూడా ప్రమాదంలో పడుతున్నారని గుర్తుచేస్తున్నారు.

కఠిన చర్యలు తీసుకోవాల్సిందే!

ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత శాఖల అధికారులు స్పందించి బహిరంగ ప్రదేశాల్లో ధూమపాన నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలు విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల్లో ప్యాసివ్ స్మోకింగ్‌పై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

సిగరెట్ తాగే వ్యక్తి తన ఆరోగ్యాన్నే కాదు.. తన చుట్టూ ఉన్నవారి ప్రాణాలనూ ప్రమాదంలోకి నెడుతున్నాడు. పొగ తాగని వారికి స్వచ్ఛమైన గాలి పీల్చే హక్కు ఉంది. ఆ హక్కును కాపాడాలంటే ధూమపాన నిషేధ నిబంధనలను కఠినంగా అమలు చేయడం అత్యవసరం.