
అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా, కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వృషకర్మ’. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. స్పర్శ్ శ్రీవాస్తవ కీలక పాత్రలో కనిపించనున్నారు. డిసెంబరు 4న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం చిత్రబృందం ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ పేరుతో సినిమాలోని తొలి పాటను విడుదల చేసింది. “సూరీడే చిమ్మచీకట్లోన నా చూపుల్లా ఉదయించాలి..” అంటూ సాగే ఈ గీతానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించడంతో పాటు స్వయంగా ఆలపించారు. అభినవకవి సాహిత్యాన్ని అందించగా.. విజయ్ బిన్నీ నృత్యరీతులను రూపొందించారు.
ట్రెజర్ హంటర్‌గా నాగచైతన్య
ఈ పాటలో నాగచైతన్యను ఓ సాహసోపేతమైన నిధి అన్వేషకుడిగా పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటోంది. ఓ అసాధారణ యాత్రకు సిద్ధమవుతున్న ట్రెజర్ హంటర్ పాత్రలో ఆయన లుక్, పాటలోని విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
‘వృషకర్మ’ పురాణ అంశాలను ఆధారంగా చేసుకున్న హారర్ యాక్షన్ థ్రిల్లర్ అని చిత్రబృందం వెల్లడించింది. ఇప్పటివరకు చూడని సరికొత్త కథాంశం, ఆసక్తికరమైన సన్నివేశాలతో ప్రేక్షకులకు భిన్నమైన సినిమాటిక్ అనుభూతిని అందించబోతున్నట్లు తెలిపింది.
