ముంబైకి చెందిన జినియా ఛటర్జీ నిద్రపోతూనే ఏకంగా రూ.9.6 లక్షల బహుమతిని గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. వేక్‌ఫిట్ సంస్థ నిర్వహించిన ఐదో విడత స్లీప్ ఇంటర్న్‌షిప్‌లో విజేతగా నిలిచి వార్తల్లో నిలిచింది. ఈ పోటీలో దేశవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, వివిధ దశల పరిశీలన అనంతరం కేవలం 10 మందిని మాత్రమే ఎంపిక చేశారు.

ఎంపికైన అభ్యర్థులు 60 రోజుల పాటు తమ నిద్ర అలవాట్లను నమోదు చేసుకోవడంతో పాటు ప్రతి వారం నిర్వహించిన ప్రత్యేక టాస్కుల్లో పాల్గొన్నారు. సినిమాల్లోని పాత్రలు నిద్రపోయే విధానాన్ని అనుకరించడం, బెడ్‌రూమ్‌ను గుర్తించి అమర్చడం, నిద్రకు అవసరమైన వస్తువులను వేలంలో సొంతం చేసుకోవడం వంటి వినూత్న సవాళ్లు పోటీలో భాగంగా ఉన్నాయి.

చివరి దశలో అత్యుత్తమ నిద్ర స్కోరు సాధించిన జినియా ఛటర్జీ విజేతగా నిలిచింది. ఈ విజయంతో ఆమెకు రూ.9.6 లక్షల నగదు బహుమతితో పాటు ప్రత్యేక విహారయాత్రను గెలుచుకునే అవకాశం కూడా లభించింది. నిద్రపోతే చాలు.. లక్షల్లో సంపాదించవచ్చనే ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

నిద్రపోతే డబ్బులు సంపాదించవచ్చా? అదీ ఏకంగా రూ.9.6 లక్షల వరకు బహుమతి పొందవచ్చా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ముంబైకి చెందిన జినియా ఛటర్జీ ఈ అవకాశాన్ని నిజం చేసి చూపించింది. టీచర్‌గా, డాన్సర్‌గా, నటిగా గుర్తింపు పొందిన ఆమె.. 60 రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది. ప్రముఖ మ్యాట్రెస్‌, హోమ్‌ ఫర్నిషింగ్‌ సంస్థ వేక్‌ఫిట్‌ నిర్వహించిన ఐదో సీజన్‌ ‘స్లీప్‌ ఇంటర్న్‌షిప్‌’లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో రూ.9.6 లక్షల నగదు బహుమతితో పాటు సంస్థ స్పాన్సర్‌ చేసిన విహారయాత్రను కూడా సొంతం చేసుకుంది. సాధారణ ఉద్యోగాలకు భిన్నంగా సాగిన ఈ పోటీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

నిద్రపోతే చాలు.. లక్షల్లో బహుమతి!

ప్రజలకు నిద్ర ప్రాధాన్యతను తెలియజేయడంతో పాటు ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వేక్‌ఫిట్‌ సంస్థ 2019 నుంచి ‘స్లీప్‌ ఇంటర్న్‌షిప్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఐదో సీజన్‌కు దేశవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. పలు దశల్లో ఎంపిక ప్రక్రియ చేపట్టడంతో పాటు వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం కేవలం 10 మందిని మాత్రమే తుది పోటీకి ఎంపిక చేశారు.

ఎంపికైన అభ్యర్థులు 60 రోజుల పాటు తమ నిద్ర సమయాలు, నిద్ర నాణ్యత, రోజువారీ నిద్ర అలవాట్లకు సంబంధించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా సంస్థ నిర్వహించే ప్రత్యేక టాస్కుల్లోనూ పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఉద్యోగం అంటే కష్టపడి పనిచేయడం.. కానీ ఈ వినూత్న ఇంటర్న్‌షిప్‌లో మాత్రం నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడమే ప్రత్యేకతగా నిలిచింది.

పోటీలో పాల్గొన్న అభ్యర్థులు క్రమబద్ధమైన నిద్ర సమయాలను పాటిస్తూ తమ నిద్ర స్కోర్లను మెరుగుపరుచుకోవాల్సి వచ్చింది. ప్రతి వారం నిర్వహించే ప్రత్యేక టాస్కుల్లోనూ తమ ప్రతిభను చూపించాల్సి ఉండేది. వీటిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి ‘ప్రో స్లీపర్ ఆఫ్ ది వీక్’ అనే గుర్తింపును అందించేవారు. ఇలా సాధించిన పాయింట్ల ఆధారంగా లీడర్‌బోర్డులో పోటీ కొనసాగేది. అయితే ఈ పోటీలో గెలవాలంటే ఎక్కువసేపు నిద్రపోతే సరిపోదు. నిర్వాహకులు రూపొందించిన వినూత్నమైన, సరదాగా అనిపించే సవాళ్లను కూడా పూర్తి చేయాల్సి వచ్చేది.

సినిమాల్లో నటీనటులు నిద్రించే విధానాలను అనుకరించడం, చుట్టూ శబ్దాలు వినిపిస్తున్నప్పటికీ నిద్రకు ఆటంకం కలగకుండా ఉండటం వంటి ఆసక్తికరమైన టాస్కులు నిర్వహించారు. వీటితో పాటు ‘బ్లాంకెట్‌’, ‘పిల్లో’ వంటి పదాలతో నిర్వహించిన సరదా పోటీలు కూడా అభ్యర్థులకు సవాలుగా నిలిచాయి. ప్రతి టాస్కులోనూ పాల్గొంటూ నిద్ర స్కోర్లను మెరుగుపరుచుకోవాల్సి వచ్చేది.

60 రోజుల పాటు సాగిన ఈ పోటీ ముగిసే సమయానికి జినియా ఛటర్జీ, రత్నగిరి మణికందన్‌, మెహెక్‌ ఖోట్‌ టాప్‌-3లో నిలిచారు. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన కరీం ఖాన్‌ కూడా తన సృజనాత్మకతతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వారాంతాల్లో నిర్వహించిన క్రియేటివ్‌ టాస్కుల్లో అత్యధిక విజయాలు సాధించి వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ద్వారా ఫైనల్‌కు చేరుకున్నారు.

ఫైనల్‌ రౌండ్‌కు నిర్వాహకులు ‘బిగ్‌ బెడ్‌’ అనే పేరు పెట్టారు. ఇందులో భాగంగా రెండు కీలకమైన సవాళ్లను నిర్వహించారు. మొదటిది ‘మెమరీ ఫోమ్‌ ఛాలెంజ్‌’. ఈ టాస్క్‌లో పోటీదారులకు కొన్ని బెడ్‌రూమ్‌ సెటప్‌ల ఫొటోలను చూపించి, వాటిని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలని సూచించారు. అనంతరం ఫొటోల్లో ఉన్నట్లుగానే బెడ్‌రూమ్‌ను తిరిగి ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

రెండోది ‘స్లీప్‌ ఆక్షన్‌’. ఇందులో నిద్రకు అవసరమైన దిండ్లు, దుప్పట్లు, లైటింగ్‌, ఏసీ నియంత్రణ పరికరాలు, శబ్ద నియంత్రణ సదుపాయాల కోసం పోటీదారులు వేలంలో పాల్గొన్నారు. ఈ రెండు సవాళ్లు పూర్తయ్యాక అభ్యర్థులు తాము ఏర్పాటు చేసుకున్న బెడ్‌రూమ్‌లలో చివరి రాత్రి నిద్రించారు.

రూ.9.6 లక్షల బహుమతి సొంతం

చివరి రాత్రి నమోదైన నిద్ర స్కోర్లతో పాటు పోటీ నిబంధనల ఆధారంగా విజేతను ఎంపిక చేశారు. ఇందులో జినియా ఛటర్జీ అత్యుత్తమ ప్రదర్శనతో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. దీంతో ఆమెకు రూ.9.6 లక్షల నగదు బహుమతితో పాటు సంస్థ స్పాన్సర్‌ చేసిన విహారయాత్ర కూడా లభించింది.

సాధారణంగా విశ్రాంతి కోసం చేసే నిద్రను ఓ ప్రత్యేక పోటీగా మార్చి, అందులో భారీ బహుమతిని గెలుచుకోవడం ద్వారా జినియా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వినూత్న కార్యక్రమం వినోదాన్ని అందించడమే కాకుండా, ఆరోగ్యకరమైన నిద్ర ప్రాధాన్యతను కూడా తెలియజేస్తోంది. తగినంత నిద్ర లేకపోతే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక, భావోద్వేగ స్థితిపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.