
- వాట్సాప్ గ్రూపుల ద్వారా దరఖాస్తుల సేకరణ
- ప్రైవేట్ కార్యాలయం నుంచే నేరుగా లాగిన్లు
- రాత్రివేళల్లో భూ రికార్డుల మార్పులు
- టెర్రాసిస్ కార్యాలయంలో సిట్ సోదాలు
- 22 వేల అనుమానాస్పద లావాదేవీలపై విచారణ.. తొమ్మిది మంది అరెస్టు
Dharani Portal Land Records Scam | హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో ధరణి పోర్టల్ ద్వారా భూ రికార్డుల మార్పుల్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాల వెనుక భారీ నెట్వర్క్ ఉన్నట్లు సిట్ దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండల స్థాయి మీ సేవ కేంద్రాల నుంచి హైదరాబాద్‌లోని ప్రైవేట్ కార్యాలయం వరకు ఈ వ్యవస్థ విస్తరించినట్లు అధికారులు గుర్తించారు.
మీ సేవ నిర్వాహకులు ప్రత్యేక వాట్సాప్ గ్రూపుల ద్వారా దరఖాస్తులు సేకరించి చార్మినార్ సమీపంలోని కార్యాలయానికి పంపినట్లు సమాచారం. అక్కడి నుంచి లాగిన్ యాక్సెస్‌ను ఉపయోగించి భూ యజమానుల పేర్లు మార్చడం, వివాదాస్పద భూములను నమోదు చేయడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
రాత్రివేళల్లో రికార్డుల మార్పులు
డిజిటల్ ఫోరెన్సిక్ లాగ్ల పరిశీలనలో సాయంత్రం 5.30 నుంచి రాత్రి 10 గంటల మధ్య భూ రికార్డుల్లో మార్పులు జరిగినట్లు సిట్ గుర్తించింది. ఈ కేసు దర్యాప్తు కోసం సీఐడీ డీజీ చారు సిన్హా పర్యవేక్షణలో 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహించారు.
టెర్రాసిస్ కార్యాలయంలో తనిఖీలు
ధరణి పోర్టల్‌ను అభివృద్ధి చేసిన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ టెర్రాసిస్ టెక్నాలజీస్ కార్యాలయంలోనూ సిట్ తనిఖీలు చేపట్టింది. మాదాపూర్‌లోని జయభేరి సిలికాన్ టవర్స్‌లో సాఫ్ట్వేర్, యూజర్ లాగ్స్, డేటాబేస్ అనుమతులను పరిశీలించింది.
అడ్మిన్, మాస్టర్ లాగిన్ల నియంత్రణ ఎవరికి ఉండేది? ప్రైవేట్ వ్యక్తులకు యాక్సెస్ ఎలా లభించింది? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. 2018లో టీజీటీఎస్ నిర్వహించిన టెండర్ వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. మొత్తం 22 వేల అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తుండగా, ఇప్పటివరకు తొమ్మిది మందిని అరెస్టు చేశారు.
