• ఉదయం 6 గంటలకు 366గా నమోదైన నగర సగటు ఏక్యూఐ
  • పలు ప్రాంతాలను కమ్మేసిన దట్టమైన పొగమంచు
  • పలు జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు
  • కాలుష్యంపై ప్రభుత్వాలను ప్రశ్నించిన ఎంపీ మనోజ్‌ ఝా
  • కేజ్రీవాల్‌పై మంత్రి కపిల్‌ మిశ్రా విమర్శలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దీపావళి ముగిసినా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గలేదు. సోమవారం ఉదయం 6 గంటలకు నగర సగటు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 366గా నమోదైంది. ఇది ‘వెరీ పూర్‌’ కేటగిరీ కాగా, 15 పర్యవేక్షణ కేంద్రాల్లో ఏక్యూఐ 400 దాటింది.

పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో దృశ్యమానత తగ్గింది. ఆగ్నేయ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, షహదరా సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పొగమంచు హెచ్చరికలు జారీ చేసింది.

15 ప్రాంతాల్లో 400 దాటిన ఏక్యూఐ

సోనియా విహార్‌లో అత్యధికంగా 449 ఏక్యూఐ నమోదైంది. బురారీ క్రాసింగ్‌లో 445, వివేక్‌ విహార్‌లో 441, జహంగీర్‌పురిలో 439, ఢిల్లీ యూనివర్సిటీ నార్త్‌ క్యాంపస్‌లో 437 నమోదయ్యాయి. రోహిణిలో 435, డీటీయూలో 431, బవానాలో 424గా నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో 404 నుంచి 418 మధ్య ఏక్యూఐ నమోదైంది.

ప్రభుత్వాలపై మనోజ్‌ ఝా ప్రశ్నలు

కాలుష్య సమస్యపై ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలను ప్రశ్నించారు. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఎదురవుతున్నా ఏడాది పొడవునా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలను కూడా బాధ్యులుగా ప్రశ్నించాలని అన్నారు. పంట వ్యర్థాల దహనాన్ని సాకుగా చూపకుండా శాశ్వత పరిష్కారాలు చూపాలని సూచించారు.

కేజ్రీవాల్‌పై కపిల్‌ మిశ్రా విమర్శలు

మరోవైపు ఢిల్లీ మంత్రి కపిల్‌ మిశ్రా ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌పై విమర్శలు చేశారు. కాలుష్యం పేరుతో దీపావళి, సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు.

ఇదిలా ఉండగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో కాలుష్య నియంత్రణకు గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ (గ్రాప్‌) మూడో దశ ఆంక్షలు కొనసాగుతున్నాయి. వాయు నాణ్యత మరింత క్షీణించకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *