
వేధింపులు తట్టుకోలేక మీడియా ముందుకు వచ్చిన బాధితురాలు..
డీజీపీ స్థాయిలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన..
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్యపై ఆరోపణలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఓ మహిళా ప్రొఫెసర్ ఆయన వేధింపులు, బెదిరింపులపై మీడియా ఎదుట తన ఆవేదనను వ్యక్తం చేయగా.. తాజాగా మరో మహిళా ప్రొఫెసర్ కూడా ముందుకొచ్చారు. వీసీ వేధింపులు తట్టుకోలేక కన్నీటిపర్యంతమయ్యారు.
తన సహచర మహిళా ప్రొఫెసర్‌ను ఉద్దేశించి వీసీ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వేధించారని బాధితురాలు ఆరోపించారు. సదరు మహిళా ప్రొఫెసర్, మరో ప్రొఫెసర్‌తో కలిసి తిరుగుతున్నారంటూ.. వారిద్దరూ భార్యాభర్తల్లా యూనివర్సిటీలో తిరుగుతున్నారని వ్యాఖ్యానించినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంపై డీజీపీ స్థాయిలో ఫిర్యాదు చేసినప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పడంతోనే మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. వీసీ వేధింపులకు గురైన బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తుండటంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
