
ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన రాజకీయ ప్రయాణంపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 2019 ఎన్నికలకు ముందు తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పోటీ చేయాలని సూచించినప్పటికీ, తాను మాత్రం మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నానని తెలిపారు. ఓటమి ఎదురైనా వెనక్కి తగ్గకుండా ఐదేళ్లపాటు ప్రజల్లో ఉంటూ పనిచేశానని, 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించానని చెప్పారు.
నారా లోకేష్ తాజాగా జీ తెలుగు నిర్వహించిన ‘జయంబు నిశ్చయంబురా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జీవితంలో ఎప్పుడూ కొత్తగా ఏదైనా సాధించాలనే తపన ఉండేదని తెలిపారు. 2019కు ముందు మంత్రిగా పనిచేసిన సమయంలో తన శాఖ పరిధిలోని అంశాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టానని వివరించారు.
2019 జనవరిలో చంద్రబాబు తనను పిలిచి ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారని లోకేష్ గుర్తుచేసుకున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నావని అడిగినప్పుడు.. కఠినమైన నియోజకవర్గం అయితే బాగుంటుందని తన అభిప్రాయాన్ని చెప్పానన్నారు. అందుకు చంద్రబాబు స్పందిస్తూ.. ‘కుప్పం నుంచి పోటీ చేయి.. నీకు ఈజీగా ఉంటుంది. నేను వేరే చోట పోటీ చేస్తాను’ అని సూచించారని వెల్లడించారు. అయితే, కుప్పం చంద్రబాబుదేనని, ఆయన అక్కడి నుంచే పోటీ చేయాలని తాను స్పష్టం చేసినట్లు తెలిపారు. దీంతో మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నానని చెప్పారు.
మంగళగిరిలోనే తమ నివాసం ఉండటం, నియోజకవర్గం పరిచయం ఉండటంతో పాటు 1985 తర్వాత అక్కడ టీడీపీ గెలవకపోవడం తనకు ఒక సవాల్‌గా అనిపించిందన్నారు. దాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని ఎన్నికల ప్రచారానికి దిగానని చెప్పారు. అయితే, 2019 ఎన్నికల్లో కేవలం 5,300 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యానని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో నియోజకవర్గ ప్రజల సమస్యలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోలేకపోయానని, అలాగే తన గురించి ప్రజలకు కూడా సరైన అవగాహన కల్పించలేకపోయానని అభిప్రాయపడ్డారు.
2019 ఎన్నికల తర్వాత కూడా మంగళగిరిని వదిలిపెట్టే ఆలోచన చేయలేదని లోకేష్ తెలిపారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ అక్కడి నుంచే పోటీ చేస్తావా అని చంద్రబాబు అడిగినప్పుడు.. 100 శాతం మంగళగిరి నుంచే పోటీ చేస్తానని చెప్పినట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఐదేళ్లపాటు నియోజకవర్గంలో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పనిచేశానన్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలోనే మూడో అత్యధిక మెజార్టీతో విజయం సాధించానని పేర్కొన్నారు. ఐదేళ్ల తన కష్టాన్ని ప్రజలు గుర్తించారని చెప్పారు.
పని ఒత్తిడిలో కొన్నిసార్లు కొన్ని విషయాలు మర్చిపోతుంటానని, అలాంటి సందర్భాల్లో ప్రజలే తనకు గుర్తు చేస్తుంటారని లోకేష్ సరదాగా వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి తనకు ఇష్టమైన రాజకీయ నాయకుడని తెలిపారు.
అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భంలో ఆయన ఇచ్చిన సలహాను కూడా లోకేష్ ప్రస్తావించారు. అన్ని రాజకీయ పార్టీల నేతలను కలుస్తూ, వారితో మాట్లాడాలని మోదీ సూచించారని వెల్లడించారు. ఆ సలహాను పాటిస్తూ వీలైనప్పుడల్లా వివిధ పార్టీల నాయకులను కలిసి మాట్లాడుతున్నానని తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో మంగళగిరి ఎంపిక, 2019 ఓటమి, 2024 విజయం, తన రాజకీయ అనుభవాలపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
