
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోష్లో ఉన్నారు. ‘కరుప్పు’, ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ చిత్రాల తర్వాత జిత్తు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీన్’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇందులో ఇన్బరాజ్ పాండియన్ పాత్రలో సూర్య నటన, డార్క్ కామెడీ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి ప్రాజెక్టులకు సంబంధించిన వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
సూర్య 49వ సినిమాకు ‘పడగోట్టి’ టైటిల్?
సూర్య తన కెరీర్లో 49వ చిత్రాన్ని దర్శకుడు మదిమారన్ పుగళేంది తెరకెక్కించనున్నట్లు సమాచారం. ‘మండాడి’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఈసారి సూర్యతో కలిసి ఓ భారీ కోస్టల్ యాక్షన్ డ్రామాను రూపొందించనున్నారని ప్రచారం జరుగుతోంది.
సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే మత్స్యకారుల జీవన విధానం, వారి కష్టాలు, సమస్యలు, పోరాటాల నేపథ్యంలో ఈ కథ సాగనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు దివంగత నటుడు ఎంజీఆర్ నటించిన క్లాసిక్ చిత్రం ‘పడగోట్టి’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కలైపులి ఎస్. థాను నిర్మాణంలో సినిమా?
ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్. థాను ఈ ప్రాజెక్ట్ను నిర్మించనున్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో సూర్య, థాను కాంబినేషన్లో వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడివాసల్’ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ‘వాడివాసల్’ తప్పకుండా తెరకెక్కుతుందని నిర్మాత థాను ఇటీవల సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో ముందుగా సూర్యతో తీరప్రాంత నేపథ్యంలోని ఈ కొత్త సినిమా ప్రారంభమవుతుందా? లేక ‘వాడివాసల్’ పట్టాలెక్కుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
సూర్య 48వ సినిమా ఎప్పుడు విడుదల?
సూర్య తదుపరి చిత్రాల జాబితాలో 48వ ప్రాజెక్ట్ కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. ‘జై భీమ్’ ఫేమ్ దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇందులో కాయదు లోహర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 మే 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఇలా ఒకవైపు ‘సీన్’ విజయాన్ని ఆస్వాదిస్తూనే, మరోవైపు విభిన్న కథలతో సినిమాలను లైనప్ చేస్తున్నారు సూర్య. టి.జె. జ్ఞానవేల్, మదిమారన్ పుగళేంది వంటి దర్శకులతో ఆయన చేయనున్న సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
