మైలవరం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సాధించిన విజయాలు ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. మూడు పార్టీల ఐక్యత, నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితోనే ఈ ఘన విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. మంగళవారం మైలవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు.

కొండపల్లి పురపాలక సంఘంలోని మొత్తం 40 స్థానాలకు గాను కూటమి 33 స్థానాలను కైవసం చేసుకుందని ఎమ్మెల్యే వెల్లడించారు. ఐదు మండలాల్లో 73 ఎంపీటీసీ స్థానాలకు గాను 62 స్థానాల్లో విజయం సాధించామని తెలిపారు. ఐదు జడ్పీటీసీ స్థానాలనూ కూటమి గెలుచుకుందని వివరించారు. మైలవరం పరిధిలోని గ్రామాల్లో 14 ఎంపీటీసీ స్థానాలకు గాను 13 స్థానాల్లో ఇబ్రహీంపట్నం మండలంలో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించారని పేర్కొన్నారు.

ఈ గెలుపు ఏ ఒక్క పార్టీకి సంబంధించినది కాదని టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల సమష్టి విజయమని వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బాధ్యత మరింత పెరిగిందని ప్రజలకు మరింత చేరువ కావాల్సిన అవసరం ఉందని సూచించారు. ఓటు వేసిన వారితో పాటు ఓటు వేయని వారిని కూడా సమానంగా గౌరవించాలని ప్రజాప్రతినిధులకు హితవు పలికారు.

ప్రజాప్రతినిధులు పదవులను అధికారంగా కాకుండా ప్రజాసేవకు లభించిన బాధ్యతగా భావించాలని అన్నారు. ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని చిన్నచిన్న అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి కూటమి ఐక్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. అభ్యర్థి ఎవరైనా కూటమి అభ్యర్థి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రతి గ్రామంలో కూటమి జెండా ఎగరడమే తదుపరి లక్ష్యమని పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రతి కుటుంబంలో సంతోషం నింపేందుకు సమష్టిగా కృషి చేయాలని అన్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *