క్రిస్మస్, సంక్రాంతి పండగలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు తీపికబురు అందించింది. రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. రేషన్ షాపుల ద్వారా కిలో కందిపప్పు రూ.100, లీటరు పామాయిల్ రూ.125, కిలో గోధుమ పిండి రూ.25కే అందించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

డిసెంబర్ నుంచి మూడు నెలల పాటు ఈ రాయితీ సరుకుల పంపిణీ కొనసాగనుంది. నిత్యావసరాల ధరల నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అధికారులతో నిర్వహించిన సమీక్షలో రాయితీపై సరుకులు అందించాలని ఆదేశించారు. ఈ పథకం కోసం నెలకు రూ.100.20 కోట్ల చొప్పున మూడు నెలలకు మొత్తం రూ.300.60 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

కందిపప్పు సరఫరా కోసం కేంద్రాన్ని 1.20 లక్షల టన్నులు కోరగా, 40,338 టన్నులు కేటాయించింది. కందిపప్పు సేకరణ, తయారీ ఒప్పందాలు, పామాయిల్ సరఫరా ఏర్పాట్లు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. మూడు నెలల తర్వాత ఈ పథకాన్ని పొడిగించాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

రైతులకు మరో వెసులుబాటు.. మొబైల్ యాప్‌తో ధాన్యం విక్రయాల షెడ్యూల్

మరోవైపు ఏపీ రైతులకు ప్రభుత్వం కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై రైతులు ధాన్యం విక్రయించేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారో మొబైల్ యాప్ ద్వారా ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు. వ్యవసాయశాఖ రూపొందించిన ‘ఏపీఏఐఎంఎస్ ఫార్మర్’ యాప్ ద్వారా ఈ సేవలు పొందవచ్చు.

గతంలో ధాన్యం విక్రయాల కోసం రైతు సేవా కేంద్రాలకు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాల్సి వచ్చేది. ఇకపై మొబైల్ నుంచే సాగు, దిగుబడి, ధాన్యం విక్రయాల వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉంది. ధాన్యాన్ని పూర్తిగా లేదా విడతల వారీగా విక్రయించేందుకు షెడ్యూల్ చేసుకోవచ్చు.

ఈ విధానం వల్ల రైతులకు సమయం, శ్రమ ఆదా అవుతాయని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఒకవైపు పండగల వేళ పేదలకు రాయితీపై నిత్యావసరాలు, మరోవైపు రైతులకు మొబైల్ ద్వారా ధాన్యం విక్రయాల సౌకర్యం కల్పించడంతో ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *