
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. కడప జిల్లా పులివెందుల మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాకు సంబంధించి ఆయనపై నమోదైన కేసులో తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో పాటు అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో జగన్ సహా పలువురిపై పులివెందుల అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వై. లక్ష్మణరావు తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఫిర్యాదుదారుడైన ఎంఈవో రఫిక్‌కు నోటీసులు జారీ చేయడంతో పాటు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించారు.
కోర్టులో పోలీసుల వాదనలు
దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, అనుమతి లేకుండా జగన్ ధర్నాకు దిగారని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ వాదించారు. ఇప్పటికే 13 మంది సాక్షులను విచారించామని, వారు జగన్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చారని కోర్టుకు తెలిపారు. ఈ సమయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.
అసలు కేసు ఏమిటంటే?
పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున ఓటు వేసేందుకు వెళ్లిన జగన్.. వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లోకి పోలీసులు అనుమతించడం లేదని ఆరోపించారు. అనంతరం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ నాయకులు, అనుచరులతో కలిసి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఈ ఘటనలో 70 మందికి పైగా పాల్గొన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై ఎంఈవో రఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నవంబర్ 1న కేసు నమోదైంది. తాజాగా జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ, కోర్టు నిర్ణయం ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.
