
నెల్లూరు జిల్లాలో భారీ భూ అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ.147.79 కోట్ల విలువైన భూములను నకిలీ పత్రాలు, సంతకాలు, వేలిముద్రలతో తనఖా రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో వైసీపీ నేత మేకపాటి రాజగోపాల్ రెడ్డిపై ఆయన సొంత మేనల్లుడు బిజివేముల సురేంద్రనాథ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
తమ భూములకు సంబంధించి నకిలీ వ్యక్తుల ఫొటోలు, పత్రాలు, సంతకాలు, వేలిముద్రలను ఉపయోగించి మార్టిగేజ్ రిజిస్ట్రేషన్లు చేసినట్లు సురేంద్రనాథ రెడ్డి తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ మేరకు గత నెల 30న పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు IPC 419, 420, 467, 468, 471, 120(B) r/w 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మేకపాటి రాజగోపాల్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు శ్రీదేవి, అభిషేక్ రెడ్డి, అభినవ్ రెడ్డి, ఆయన బావ పాపకన్ను ప్రభాకర్ రెడ్డి, మరికొందరిపై కేసు నమోదైనట్లు సమాచారం.
ఈ వ్యవహారంలో నెల్లూరులోని ఇండియన్ బ్యాంక్ అధికారుల పాత్రపైనా సమగ్ర విచారణ జరపాలని ఫిర్యాదుదారు సురేంద్రనాథ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దాదాపు రూ.147.79 కోట్ల విలువైన భూముల వ్యవహారం కావడంతో ఈ ఫిర్యాదు జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది.
