D Spiritual: Nov 11: డిసెంబర్ 9వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు

ఆరు భజన బృందాలతో నిరంతర శివనామ స్మరణ

నంద్యాల: జ్యోతిర్లింగాల్లో ఒకటైన నంద్యాల జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామివారి లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ప్రతి సంవత్సరం శ్రావణ, కార్తీక మాసాల్లో దేవస్థానం ఆధ్వర్యంలో శివ చతుస్సప్తాహ భజనలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ భజనలు నెల రోజులపాటు రేయింబవళ్లు నిరంతరంగా కొనసాగుతాయని పేర్కొన్నారు.

కార్తీక మాసోత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని మంగళవారం అఖండ శివభజనలు ప్రారంభమయ్యాయని, ఇవి మార్గశిర శుద్ధ పాడ్యమి అయిన డిసెంబర్ 9వ తేదీ వరకు కొనసాగుతాయని వివరించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యురాలు కోడె కాంతివర్ధిని, శ్రీ స్వామివార్ల ప్రధాన అర్చకులు హెచ్. వీరయ్యస్వామి, ఇతర అర్చకులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పం పఠించారు. అనంతరం భజన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని మహాగణపతి పూజ నిర్వహించారు. ఆ తర్వాత శాస్త్రోక్తంగా చండీశ్వరస్వామివారికి విశేష పూజలు జరిపించారు. ఈ పూజల అనంతరం శివ ప్రణవ పంచాక్షరీ నామ అఖండ శివభజన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లాకు చెందిన మూడు, కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాకు చెందిన మూడు భజన బృందాలకు అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా శ్రీ గురు నిమిషాంబ దేవి భజన మండలి, కర్నూలు బృందం నవంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ భజన బృందం, కర్నూలు నవంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు, శ్రీశ్రీశ్రీ గంగాభవానీ సమేత కేదారేశ్వర స్వామి దేవస్థానం కమిటీ, కర్నూలు నవంబర్ 20 నుంచి 24వ తేదీ వరకు భజనలు నిర్వహించనున్నాయి.

అదేవిధంగా శ్రీ మౌళీ బసవేశ్వర భజన మండలి, గోపనదేవరహళ్లి, రాయచూర్ జిల్లా బృందం నవంబర్ 24 నుంచి 29వ తేదీ వరకు, శ్రీ మల్లికార్జున భజన మండలి, సుంకేశ్వరహాల్, రాయచూర్ జిల్లా బృందం నవంబర్ 29 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు, శ్రీ రఘు లింగ సేవా సంఘం, గోపనదేవరహళ్లి, రాయచూర్ జిల్లా బృందం డిసెంబర్ 4 నుంచి 9వ తేదీ వరకు భజనలు నిర్వహించనున్నాయి.

ఈ అఖండ శివనామ స్మరణ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *