D Spiritual: Nov 11: బలిపాడ్యమి సందర్భంగా మూలరామదేవునికి మహా పంచామృతాభిషేకం.. విశేష పూజలు నిర్వహించిన పీఠాధిపతి

మంత్రాలయం: కార్తీక మాసం బలిపాడ్యమి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మకరచిత మూలరామదేవునికి రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు మహా పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి మహా మంగళహారతులు సమర్పించారు. ఈ విశేష పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు.

బ్రహ్మకరచిత మూలరామదేవుడు సంవత్సరంలో కేవలం రెండుసార్లు మాత్రమే ప్రత్యేక పూజలు అందుకుంటూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీరామనవమి, కార్తీక మాసం బలిపాడ్యమి పర్వదినాల్లో మాత్రమే రాఘవేంద్ర స్వామి మఠంలోని పూజా మందిరంలో పీఠాధిపతి స్వయంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ సందర్భంగా మూలరామదేవునికి నిర్మాల్యం, పంచామృతాభిషేకం, కనకాభిషేకం, నవరత్నాభిషేకం నిర్వహించి మహా మంగళహారతులు సమర్పించారు. అలాగే జయరామ, దిగ్విజయరామ, మూలరాములకు విశేష పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ పూజా కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అనంతరం పీఠాధిపతి గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని మహా మంగళహారతులు సమర్పించారు. ఆ తర్వాత రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి మంగళహారతులు ఇచ్చి అష్టోదకం సమర్పించారు. పూర్వ పీఠాధిపతుల బృందావనాలకు కూడా మంగళహారతులు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

చివరగా భక్తులకు ఫలమంత్ర అక్షింతలు అందజేసి పీఠాధిపతి ఆశీర్వదించారు. బ్రహ్మకరచిత మూలరామదేవునికి నిర్వహించిన మహా పంచామృతాభిషేకం, విశేష పూజా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *