D Spiritual: Nov 11: నాగుల చవితి సందర్భంగా తిరుమలలో పెద్దశేష వాహన సేవ.. ఉభయ దేవేరులతో దర్శనమివ్వనున్న మలయప్పస్వామి

తిరుమల: నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 13వ తేదీన తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు తిరుమల మాడ వీధుల్లో విహరించనున్నారు.

సర్పరాజైన ఆదిశేషుడు శ్రీమహావిష్ణువుకు నివాస భూమిగా, శయన తల్పంగా, సింహాసనంగా సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే శ్రీ వేంకటేశ్వరస్వామివారికి సహస్రనామాల్లో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం వంటి నామాలతో నిత్య పూజలు నిర్వహిస్తారు.

ఆదిశేషుడు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడిగా స్వామివారికి అత్యంత సన్నిహితుడిగా సేవలందించారు. శ్రీ వైకుంఠంలోని నిత్యసూరులలో ఆదిశేషుడు ఆద్యుడిగా విశిష్ట స్థానం పొందాడు. స్వామివారిపై ఆయనకున్న అపారమైన భక్తి, సేవాభావం భక్తులకు ఆదర్శంగా నిలుస్తాయి.

దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియభక్తుడైన ఆదిశేషుడిపై స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిస్తారు. ఈ వాహన సేవ ద్వారా భక్తులకు శరణాగతి తత్వాన్ని, భగవంతుడిపై సంపూర్ణ భక్తి విశ్వాసాలను చాటిచెబుతారు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లోనూ వాహన సేవలకు ఆదిశేషుడితోనే తొలి ప్రాధాన్యత ఉంటుంది. పెద్దశేష వాహనంపై స్వామివారి దర్శనం భక్తులకు విశేష ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *