బియ్యం ధరల భారాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ధరణి పేరుతో 26 కిలోల సన్నబియ్యం బస్తాను రూ.1,300కే ప్రజలకు అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయాలు చేపడుతోంది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో అవసరమైన చోట్ల అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.

గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఆరు రైతు బజార్లలో ధరణి బియ్యం విక్రయ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు సుమారు 4,500 మంది వినియోగదారులు 1,150 క్వింటాళ్ల బియ్యం కొనుగోలు చేశారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. నాలుగు రకాల బియ్యం అందుబాటులో ఉంచుతున్నారు. కొనుగోలుదారుల పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ వివరాలను నమోదు చేస్తున్నారు.

బియ్యం ధరలపై అధికారుల నిఘా

మరోవైపు బియ్యం ధరల పెరుగుదలను నియంత్రించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ రైస్ మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి దుకాణం, మిల్లు వద్ద బియ్యం రకాల వారీగా ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు.

ప్రభుత్వం నిర్దేశించిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • బీపీటీ (సోనా, సాంబా), కేఎన్‌ఎం – కిలో రూ.66
  • హెచ్‌ఎంటీ, ఆర్‌ఎన్‌ఆర్ – కిలో రూ.76
  • స్వర్ణ మసూరి – కిలో రూ.47
  • జైశ్రీరామ్ – కిలో రూ.82

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

బియ్యం విక్రయాల్లో అధిక ధరల వసూళ్లు, తూనికలు, కొలతల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. పౌరసరఫరాలు, విజిలెన్స్, తూనికలు, కొలతల శాఖలతో పాటు జీఎస్టీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించేలా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేశారు.

ధరణి కేంద్రాల ద్వారా తక్కువ ధరకే బియ్యం అందుబాటులోకి రావడంతో సామాన్య వినియోగదారులకు కొంత ఊరట లభిస్తోంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *