
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహానికి కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఆహ్వానించారు. తన భర్త అనిల్ కుమార్తో కలిసి రాహుల్ గాంధీని స్వయంగా కలిసిన ఆమె, కుమార్తె వైఎస్ అంజలిరెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.
ఈ విషయాన్ని షర్మిల తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు. రాహుల్ గాంధీని కలిసిన ఫొటోలను కూడా షేర్ చేశారు. తమ కుటుంబం ఎంతో ఆనందంగా ఎదురుచూస్తున్న ఈ ప్రత్యేక వేడుకకు ఆయన హాజరుకావడం గౌరవంగా భావిస్తామని పేర్కొన్నారు.
వైఎస్ అంజలిరెడ్డి వివాహం నవంబర్ 25న జరగనుండగా, డిసెంబర్ 5న రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను షర్మిల కుటుంబం ఆహ్వానిస్తోంది.
