
విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాష్ట్ర చేనేత సంప్రదాయాలను ప్రతిబింబించే హ్యాండ్‌లూమ్ జాకెట్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. నేతన్నల కళా నైపుణ్యానికి ప్రోత్సాహం అందించడంతోపాటు ఆంధ్రప్రదేశ్ చేనేత వైభవాన్ని అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పేలా ఆయన ఈ ప్రత్యేక వస్త్రధారణను ఎంచుకున్నారు.
రాష్ట్రంలోని చేనేత కళాకారుల ప్రతిభకు తగిన గుర్తింపు రావాలని సంప్రదాయ హస్తకళలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరగాలని ఈ సందర్భంగా లోకేశ్ సందేశమిచ్చారు. తాను ధరించిన జాకెట్ ఏ చేనేత కళకు ప్రతీకో గుర్తించాలంటూ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఆసక్తికర ప్రశ్నను కూడా సంధించారు.
ఇదిలా ఉండగా విశాఖపట్నంలో గురువారం 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 అట్టహాసంగా ప్రారంభమైంది. ‘నేవిగేటింగ్ ది న్యూ వరల్డ్ ఆర్డర్’ అనే ఇతివృత్తంతో తొలిరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ సదస్సును ప్రారంభించారు.
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు 58 దేశాల నుంచి ప్రతినిధులు పారిశ్రామికవేత్తలు, విదేశీ రాయబారులు హాజరయ్యారు.
వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్రంలో పెట్టుబడులు పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అవకాశాలను అన్వేషించడంపై సదస్సులో చర్చలు సాగుతున్నాయి. ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ), పునరుత్పాదక ఇంధన రంగాలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు.
ఒకవైపు అంతర్జాతీయ పెట్టుబడులపై చర్చలు సాగుతుండగా మరోవైపు చేనేత జాకెట్‌తో మంత్రి నారా లోకేశ్ తెలుగు సంప్రదాయాల గొప్పతనాన్ని చాటడం ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
