
ఆంధ్రప్రదేశ్‌ను తూర్పు తీరానికి ముఖద్వారంగా దేశంలోనే ప్రముఖ మారిటైమ్ హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోర్టులు, షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం రాష్ట్రానికి అతిపెద్ద వ్యూహాత్మక బలమని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని నాన్-మేజర్ పోర్టుల ద్వారా ఏటా 117 మిలియన్ టన్నులకు పైగా కార్గో నిర్వహణ జరుగుతోందని వివరించారు. ఈ సామర్థ్యాన్ని మరింత పెంచేలా రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే పోర్టుల అభివృద్ధికి భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
పోర్టులు, సముద్ర రంగ విస్తరణ కార్యక్రమాల ద్వారా రూ.22,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందన్నారు. 2026 డిసెంబర్ నుంచి 2027 మార్చి మధ్య రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల కార్యకలాపాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ పోర్టులు అందుబాటులోకి వస్తే రాష్ట్ర కార్గో నిర్వహణ సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 195 MTPA నుంచి 286 MTPAకు పెరుగుతుందని తెలిపారు.
మత్స్యకారులకు మెరుగైన మౌలిక సదుపాయాలు
మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి చెప్పారు. జువ్వలదిన్నె, ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. బుడిగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నంలో మత్స్యకారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.690 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు.
దుగ్గరాజపట్నంలో మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్
దుగ్గరాజపట్నంలో సుమారు రూ.29,000 కోట్ల పెట్టుబడి సామర్థ్యంతో మెగా షిప్‌బిల్డింగ్ అండ్ మారిటైమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నౌకా నిర్మాణం, నౌకల మరమ్మతులు, మెరైన్ ఇంజినీరింగ్, సముద్ర పరికరాల తయారీ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
