
గన్నవరం రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బహిరంగ సవాల్ విసిరారు. వైఎస్సార్‌సీపీకి నిజంగా ప్రజాబలంపై నమ్మకం ఉంటే గన్నవరం జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సిద్ధం కావాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం జెడ్పీటీసీగా ఉన్న రవితో రాజీనామా చేయించి, ఆ స్థానంలో వల్లభనేని వంశీ పోటీ చేయాలని సవాల్ చేశారు. ఈ ఎన్నికలో వంశీ గెలిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.
ఇటీవల గన్నవరం రాజకీయ పరిణామాలపై స్పందించిన యార్లగడ్డ వెంకట్రావు.. వల్లభనేని వంశీ తనపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో ప్రజలు వంశీని ఓడించి ఇంటికి పంపించినప్పటికీ ఆయన వైఖరిలో మార్పు రాలేదని విమర్శించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో వచ్చిన విజయంతోనే నియోజకవర్గమంతా తమదేనన్నట్లుగా మాట్లాడటం సరికాదన్నారు. గన్నవరం నియోజకవర్గంలో మొత్తం ఓట్లను పరిశీలిస్తే కూటమికే ఎక్కువ మద్దతు లభించిందని పేర్కొన్నారు.
టీడీపీలో డబ్బున్నవారికే ప్రాధాన్యత ఇవ్వకుండా, క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు అవకాశాలు కల్పిస్తున్నామని వెంకట్రావు తెలిపారు. తాను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజల కోసం సొంత డబ్బును కూడా ఖర్చు చేస్తున్నానని చెప్పారు. హైదరాబాద్‌లో ఉంటున్న వల్లభనేని వంశీ నెలకు ఒకసారి మాత్రమే గన్నవరం వస్తున్నారని విమర్శించారు.
తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే సహించేది లేదని యార్లగడ్డ హెచ్చరించారు. కొందరు సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తూ ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. మరికొందరు యూట్యూబర్లు ఫోన్ పేలు, డైమండ్ రింగులు తీసుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. గన్నవరం జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం తనపై చర్యలు తీసుకుంటోందంటూ వస్తున్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు.
తాను ఎలాంటి తప్పులు, కుట్రలు, అక్రమాలకు పాల్పడలేదని, వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలని సూచించారు. గన్నవరం ప్రజల మనసు గెలుచుకోవడం వల్లే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని స్పష్టం చేశారు. తనకు సంస్కారం ఉందని, అందుకే హద్దులు దాటకుండా మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. గత కొద్దిరోజులుగా నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు తనను బాధించాయని యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యానించారు.
