
అనంతపురం, అనంతపురం జిల్లా పామిడి రైల్వే స్టేషన్ ప్రయాణికులకు ఆశించిన స్థాయిలో ఉపయోగపడటం లేదు. నేషనల్ హైవే 44కు సమీపంలోనే ఉన్నప్పటికీ సరైన రహదారి సౌకర్యం, రైళ్ల హాల్టులు లేక స్టేషన్ ప్రయాణికులు లేక వెలవెలబోతోంది. కోట్లాది రూపాయలతో స్టేషన్ను నిర్మించినా పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పామిడి పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఈ రైల్వే స్టేషన్ ఉంది. జాతీయ రహదారి 44లోని నీలూరు రోడ్డు పాయింట్ నుంచి స్టేషన్కు చేరుకోవాలంటే దాదాపు 2 కిలోమీటర్ల మేర పొలాల మధ్య ఉన్న మట్టి దారిలో ప్రయాణించాల్సి వస్తోంది. సరైన రహదారి లేకపోవడంతో వర్షాకాలంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆటో సౌకర్యం కూడా అందుబాటులో లేకపోవడంతో చాలామంది గుత్తి, అనంతపురం రైల్వే స్టేషన్లకు వెళ్లాల్సి వస్తోంది.
ప్రస్తుతం పామిడి స్టేషన్లో రోజుకు ఒక్క జత డెము రైళ్లు మాత్రమే ఆగుతున్నాయి. హిందూపురం-గుంతకల్లు డెము (77214) ఉదయం 9:36 గంటలకు, గుంతకల్లు-హిందూపురం డెము (77213) సాయంత్రం 5:02 గంటలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ మార్గంలో పలు ఎక్స్ప్రెస్ రైళ్లు స్టేషన్ మీదుగా వెళ్తున్నప్పటికీ హాల్ట్ లేకపోవడంతో ప్రయాణికులకు ప్రయోజనం లేకుండా పోతోంది.
ధర్మవరం-మచిలీపట్నం, కాచిగూడ-యశ్వంత్పూర్, నాందేడ్ ఎక్స్ప్రెస్ వంటి రైళ్లకు పామిడిలో హాల్ట్ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. స్టేషన్కు జాతీయ రహదారి నుంచి తారు రోడ్డు నిర్మించడంతోపాటు ఆటో సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరిన్ని రైళ్లకు హాల్ట్ సదుపాయం కల్పిస్తే పామిడి పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడటంతోపాటు స్టేషన్ వినియోగం కూడా పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
