తిరుమల, తిరుమల శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరింత చేరువ చేసేందుకు టీటీడీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ‘సద్గమయ’ పేరుతో ప్రత్యేక ఆన్‌లైన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినమైన డిసెంబర్ 20 నుంచి ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

రామాయణం, మహాభారతం, భగవద్గీత వంటి మహోన్నత ఇతిహాసాలు, ఆధ్యాత్మిక గ్రంథాల్లోని ముఖ్యమైన అంశాలను సామాన్య భక్తులకు సులభంగా అర్థమయ్యేలా రోజువారీ పాఠాల రూపంలో అందించనున్నారు. ఇందుకోసం టీటీడీ ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టల్‌ను రూపొందించింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, ఆంగ్లం.. ఇలా మొత్తం ఐదు భాషల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనాలనుకునే భక్తులు పోర్టల్‌లో రూ.5 చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

తొలుత శ్రీవారి సేవకుల ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించి, ఆ తర్వాత దేశ, విదేశాల్లోని భక్తులకు ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని టీటీడీ భావిస్తోంది. కేవలం ఆధ్యాత్మిక పాఠాలకే పరిమితం కాకుండా వాటిపై భక్తులకు అవగాహన పెంపొందించేందుకు ప్రతిరోజూ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కూడా నిర్వహించనుంది. అత్యధిక మార్కులు సాధించిన ఆరుగురిని లక్కీడిప్‌ ద్వారా ఎంపిక చేసి, వారి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించనుంది.

పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనం

నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో శుక్రవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుంచి స్వామి, అమ్మవార్లు తిరుమాడ వీధుల్లో విహరించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు.

పురాణాల ప్రకారం సర్పరాజైన ఆదిశేషుడు శ్రీమహావిష్ణువుకు నివాసంగా, శయ్యగా, సింహాసనంగా సేవలందిస్తుంటాడు. అందుకే స్వామివారికి శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం వంటి నామాలతో నిత్య పూజలు నిర్వహిస్తారు. రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడిగా ఆదిశేషుడు స్వామివారికి సన్నిహితంగా సేవలందించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి.

నిత్యసూరుల్లో ఆద్యుడిగా, దాసభక్తికి ప్రతిరూపంగా నిలిచే ఆదిశేషుడిపై ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు భక్తులకు దర్శనమివ్వడం విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుంది. బ్రహ్మోత్సవాల్లోనూ తొలి వాహన సేవగా పెద్ద శేష వాహనానికి ప్రాధాన్యత కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వాహన సేవను తిలకించిన భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *