
తణుకు, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బలగం సీతారాం కుమారులు బలగం బాబీ, బలగం రాజ్కుమార్తో పాటు వారి కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తన క్యాంపు కార్యాలయంలో వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
బలగం సీతారాం మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు సమీప బంధువు కావడం ఈ చేరికకు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. బొత్స సత్యనారాయణ సోదరుడు సతీష్ కుమార్కు బలగం సీతారాం వియ్యంకుడు. తూర్పుకాపు సామాజికవర్గంలోనూ బలగం కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. బలగం బాబీ గతంలో వైఎస్సార్సీపీ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు.
మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బలగం కుటుంబం టీడీపీలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీను అలియాస్ చిన్న శ్రీను టీడీపీలో చేరగా, తాజాగా బలగం కుటుంబం కూడా అధికార కూటమి పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ.. బలగం కుటుంబ సభ్యులు టీడీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పాలనపై నమ్మకంతో వారు పార్టీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. బలగం సీతారాం కుటుంబం చేరికతో తణుకులో టీడీపీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి, ప్రజాసేవకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
