
D news:nov:14హెచ్‌ఐవీ నివారణలో వైద్య రంగం మరో కీలక ముందడుగు వేస్తోంది. లెనకాపావిర్ (Lenacapavir) అనే దీర్ఘకాలిక ప్రభావం కలిగిన ఔషధం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఔషధాన్ని ఆరు నెలలకు ఒకసారి ఇంజెక్షన్ రూపంలో తీసుకోవడం ద్వారా హెచ్‌ఐవీ సంక్రమణ ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని క్లినికల్ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రోజూ ప్రీఈపీ (PrEP) మాత్రలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా, ఏడాదికి కేవలం రెండుసార్లు ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోవడం దీని ప్రధాన ప్రత్యేకత. హెచ్‌ఐవీ నివారణను మరింత సులభతరం చేయడంలో ఈ ఔషధం కీలక పాత్ర పోషించే అవకాశముంది.
హెచ్‌ఐవీ నివారణలో కొత్త ఆశాకిరణం
ఉగాండాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న బరారా నగరంలో హెచ్‌ఐవీ వ్యాప్తి ఆందోళనకరంగా మారుతోంది. ముఖ్యంగా రెడ్‌లైట్ ప్రాంతాల్లో పనిచేసే మహిళలు వైరస్ బారిన పడకుండా ఉండేందుకు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. లైంగిక సంబంధాల సమయంలో కండోమ్‌లు ఉపయోగించాలని కోరుతున్నప్పటికీ, కొందరు పురుషులు వాటిని తొలగించేందుకు లేదా చింపేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
హెచ్‌ఐవీ ముప్పును తగ్గించుకునేందుకు ఆమె ప్రస్తుతం ప్రీఈపీ (PrEP) మందులను వినియోగిస్తోంది. అయితే, దీర్ఘకాలిక రక్షణ అందించే లెనకాపావిర్ ఇంజెక్షన్ అందుబాటులోకి రావడం ఆమెతో పాటు పలువురు లైంగిక కార్మికుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి మాత్రమే తీసుకోవాల్సి ఉండటంతో, తరచూ ప్రయాణాలు చేసే వారికి ఈ ఇంజెక్షన్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడింది. హెచ్‌ఐవీ నివారణలో ఈ కొత్త విధానం కీలక మార్పునకు దారితీస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
జనరిక్ లెనకాపావిర్‌కు ఎఫ్‌డీఏ తాత్కాలిక ఆమోదం
లెనకాపావిర్ జనరిక్ వెర్షన్‌కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) తాత్కాలిక ఆమోదం తెలిపినట్లు కథనంలో పేర్కొన్నారు. దీంతో తక్కువ ఆదాయం కలిగిన 120 దేశాలకు ఈ ఔషధాన్ని సరఫరా చేసేందుకు మార్గం సుగమం కానుంది. జనరిక్ రూపంలో ఏడాదికి సుమారు 40 డాలర్లకే అందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో అమెరికాలో బ్రాండ్ ఔషధం వార్షిక జాబితా ధర 28,218 డాలర్లుగా ఉంది. 2028 చివరి నాటికి 30 లక్షల మందికి లెనకాపావిర్‌ను అందించాలని గ్లోబల్ ఫండ్ లక్ష్యంగా పెట్టుకుంది. మరింతమందికి తక్కువ ధరకు ఈ ఔషధం అందుబాటులోకి రావాలని డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ వంటి సంస్థలు కోరుతున్నాయి.
ఉగాండాలో లెనకాపావిర్ డోసులకు తీవ్ర కొరత
ఉగాండాలోని బరారా నగరంలో పెద్దల్లో సుమారు 10 శాతం మందికి హెచ్‌ఐవీ ఉన్నట్లు అంచనా. ఇది ఆ దేశ జాతీయ సగటు కంటే రెండింతలు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో తన భార్యకు హెచ్‌ఐవీ సోకినట్లు నిర్ధారణ కావడంతో, వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఓ వ్యక్తి లెనకాపావిర్ ఇంజెక్షన్ పొందాలని ప్రయత్నించాడు. అయితే స్థానిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైనన్ని డోసులు లేకపోవడంతో నిరాశ ఎదురైంది.
ఏప్రిల్‌లో ఆరోగ్య కేంద్రానికి చేరిన 40 డోసులు కొద్ది రోజుల్లోనే పూర్తయ్యాయి. జూన్‌లో వచ్చిన మరో 70 డోసులు కేవలం పది రోజుల్లోనే అయిపోయాయి. గత మూడు దశాబ్దాల్లో ఉగాండాలో హెచ్‌ఐవీ వ్యాప్తి తగ్గినప్పటికీ, లైంగిక సంబంధాల ద్వారా వైరస్ సంక్రమణ ఇంకా ప్రధాన సమస్యగానే కొనసాగుతోంది.
లెనకాపావిర్‌పై పెరుగుతున్న ఆసక్తి, అధిక డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడం వల్ల అర్హులైన వారందరికీ నివారణ సేవలు అందడం లేదు. ఔషధం ఉత్పత్తిని పెంచడంతోపాటు, ధరను తగ్గించి పేద దేశాలకు సైతం అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
