ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 16వ తేదీ నాటికి తుపానుగా రూపాంతరం చెందవచ్చని, అనంతరం ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ మరింత తీవ్రతను సంతరించుకోవచ్చని వెల్లడించింది. బుధవారం నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే తుపాను ఎక్కడ తీరం దాటుతుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారి, అదే రోజు సాయంత్రానికి దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది. తుపాను గమనం, తీరం దాటే ప్రాంతంపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన.. అలర్ట్‌లు జారీ

తుపాను ప్రభావంతో ఈ నెల 18, 19 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు ప్రకటించింది.

ఈ నెల 18న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక 19న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అదే రోజు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తుపాను కదలికలను బట్టి వర్షాల తీవ్రత, ప్రభావిత జిల్లాల్లో మార్పులు ఉండవచ్చని అధికారులు తెలిపారు.

మత్స్యకారులకు హెచ్చరిక.. సముద్రంలోకి వెళ్లొద్దు

తుపాను ప్రభావంతో కోస్తా తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సముద్రంలో అలలు ఉధృతంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇప్పటికే సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఆదివారం సాయంత్రంలోగా తీరానికి చేరుకోవాలని అధికారులు ఆదేశించారు. ఈ నెల 16వ తేదీ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని స్పష్టం చేశారు.

తుపాను తీరం దాటే ప్రాంతంపై స్పష్టత వచ్చే వరకు ఉత్తరాంధ్రతోపాటు ఇతర తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ జారీ చేసే తాజా హెచ్చరికలు, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *