తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదుల కోటా విడుదల షెడ్యూల్‌ను ప్రకటించింది. నవంబర్ 18వ తేదీ నుంచి విడతల వారీగా ఆన్‌లైన్‌లో టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. భక్తులు ముందుగానే షెడ్యూల్‌ను గమనించి, తమకు అనుకూలమైన తేదీల్లో టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.

ఫిబ్రవరి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవా టికెట్ల కోటాను నవంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ సేవా టికెట్ల కోసం ఎలక్ట్రానిక్ డిప్ (లక్కీ డిప్) విధానంలో భక్తులు నమోదు చేసుకోవచ్చు.

నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్‌లో పాల్గొనేందుకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానంలో టికెట్లు కేటాయించబడిన భక్తులు నవంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు నిర్ణీత మొత్తాన్ని చెల్లించి తమ టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

ఫిబ్రవరి నెల దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల టికెట్లకు సంబంధించిన తదుపరి విడుదల తేదీలను కూడా భక్తులు గమనించాలని టీటీడీ సూచించింది. టికెట్ల కోసం అధికారిక టీటీడీ వెబ్‌సైట్‌లో మాత్రమే నమోదు చేసుకోవాలని, చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని కోరుతోంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *