
అమెరికాలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ మరో ప్రమాదం చోటుచేసుకుంది. మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు విమానాలు టార్మాక్‌పై ఢీకొన్నాయి. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాత్రి 9:15 గంటల సమయంలో రన్‌వేపై మలుపు తిరుగుతున్న కోపా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం రెక్క కొన.. వెనుక నుంచి వస్తున్న యూపీఎస్ బోయింగ్ 767 కార్గో విమానం ముక్కును ఢీకొట్టింది. పనామా సిటీ నుంచి 166 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వచ్చిన కోపా విమానం ఈ ప్రమాదానికి గురైంది.
ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయని కోపా ఎయిర్‌లైన్స్ ఆదివారం వెల్లడించింది. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి ప్రమాదకరంగా లేదని తెలిపింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా, అమెరికాలో శుక్రవారం విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో శుక్ర, శనివారాల్లో పలు విమానాశ్రయాల్లో లక్షలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో మియామి విమానాశ్రయంలో జరిగిన మరో ఘటన ప్రయాణికుల్లో ఆందోళన కలిగించింది.
