ఆంధ్రప్రదేశ్‌కు మరో నాలుగు కొత్త విశ్వవిద్యాలయాలు రానున్నాయి. రాష్ట్రంలో ఉన్నత విద్యా రంగాన్ని మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అమరావతిలో గ్లోబల్ యూనివర్సిటీ సిస్టమ్స్ ఆధ్వర్యంలో ప్రైవేటు విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. అలాగే విశాఖపట్నంలో టీఐఈటీ ఆఫ్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన రెండు విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.3,500 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటి ఏర్పాటుతో ప్రత్యక్షంగా దాదాపు 6 వేల మందికి, పరోక్షంగా మరో 12 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యా రంగానికి మరింత ఊతమిచ్చేలా మరో నాలుగు కొత్త విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో రెండు డీమ్డ్ యూనివర్సిటీల ఆఫ్ క్యాంపస్‌లు, మరో రెండు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉండనున్నాయి. ఈ నాలుగు వర్సిటీల ఏర్పాటుకు సంబంధించి ఏపీ ప్రభుత్వంతో ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి. అంతేకాకుండా, ఇవి ఎన్‌ఐఆర్‌ఎఫ్‌-2025 జాతీయ ర్యాంకింగ్స్‌లో టాప్-70లో స్థానం పొందిన విద్యాసంస్థలుగా చెబుతున్నారు.

ఈ నాలుగు విశ్వవిద్యాలయాల ఏర్పాటుతో రాష్ట్రానికి మొత్తం రూ.3,500 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అమరావతి, విశాఖపట్నంలో రెండు యూనివర్సిటీల ఏర్పాటుకు ఆమోదం లభించగా, మిగిలిన రెండు వర్సిటీలను ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఈ విద్యాసంస్థలు అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా సుమారు 6 వేల మందికి, పరోక్షంగా మరో 12 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ నాలుగు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కలిపి దాదాపు 200 ఎకరాల భూమి అవసరమవుతుందని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా అమరావతిలో గ్లోబల్ యూనివర్సిటీ సిస్టమ్స్ (జీయూఎస్) ప్రైవేటు వర్సిటీని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్యాశాఖతో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జీయూఎస్ పరిధిలో ప్రస్తుతం 36 విద్యాసంస్థలు ఉన్నాయి.

అమరావతిలో యూనివర్సిటీ ఏర్పాటు కోసం రెండు విడతల్లో మొత్తం 50 ఎకరాల భూమిని కేటాయించాలని అధికారులు ప్రతిపాదించారు. ఇందులో తొలుత 30 ఎకరాలు, ఆ తర్వాత మరో 20 ఎకరాలు అందించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం జీయూఎస్ రూ.2,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా ప్రత్యక్షంగా 1,600 మందికి, పరోక్షంగా మరో 3 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌-2025 జాతీయ ర్యాంకింగ్స్‌లో ఈ సంస్థ 45వ స్థానంలో ఉంది.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌కు చెందిన షూలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయితే ఈ వర్సిటీని రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టాలని సంస్థ ప్రతిపాదించింది. యూనివర్సిటీ ఏర్పాటుకు 30 నుంచి 50 ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా వేసింది. ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 1,500 మందికి, పరోక్షంగా 3 వేల మందికి ఉపాధి లభించనుంది. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌-2025 ర్యాంకింగ్స్‌లో షూలిని యూనివర్సిటీ 69వ స్థానంలో నిలిచింది.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటు కానున్న విశ్వవిద్యాలయాల జాబితాలో మరో రెండు ప్రముఖ విద్యాసంస్థలు చేరనున్నాయి. పంజాబ్‌లోని పాటియాలాకు చెందిన థాపర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (టీఐఈటీ), విశాఖపట్నంలో తన ఆఫ్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదాలో ఉన్న ఈ సంస్థ, విశాఖలో కొత్త క్యాంపస్ ఏర్పాటుకు ముందుకొచ్చింది.

ఈ క్యాంపస్ కోసం విశాఖపట్నంలో 50 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇందుకోసం రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 1,400 మందికి, పరోక్షంగా మరో 3 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌-2025 జాతీయ ర్యాంకింగ్స్‌లో టీఐఈటీ 26వ స్థానంలో నిలిచింది.

మరో ప్రముఖ విద్యాసంస్థ నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (ఎన్‌ఎంఐఎంఎస్) కూడా ఆంధ్రప్రదేశ్‌లో తన ఆఫ్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం డీమ్డ్ టు బి యూనివర్సిటీగా కొనసాగుతున్న ఈ సంస్థకు అనుబంధంగా మరో క్యాంపస్ అందుబాటులోకి రానుంది. అయితే, రాష్ట్రంలో ఈ క్యాంపస్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఎన్‌ఎంఐఎంఎస్ క్యాంపస్ ఏర్పాటుకు 30 నుంచి 50 ఎకరాల భూమి అవసరమవుతుందని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా ప్రత్యక్షంగా 1,500 మందికి, పరోక్షంగా మరో 3 వేల మందికి ఉపాధి లభించనుంది. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌-2025 జాతీయ ర్యాంకింగ్స్‌లో ఈ విద్యాసంస్థ 52వ స్థానాన్ని దక్కించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *