D news:nov:16మన శరీరంలోని అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన పిత్తరసాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు, మనం తీసుకునే ఆహారంలోని పోషకాలను ప్రాసెస్ చేయడం, రక్తంలోని హానికర పదార్థాలను తొలగించడం వంటి ఎన్నో ముఖ్యమైన విధులను కాలేయం నిర్వహిస్తుంది. అంతేకాకుండా శరీరంలో జీవక్రియలు సక్రమంగా సాగేందుకు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు కూడా దోహదపడుతుంది. అయితే మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మద్యపానం, అధిక బరువు, మధుమేహం వంటి కారణాలు కాలేయ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీంతో కాలేయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతోంది.

కాలేయం (Liver) మన పొట్టకు కుడివైపు పైభాగంలో ఉంటుంది. శరీరంలోని జీవక్రియలు సక్రమంగా సాగేందుకు ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారం జీర్ణం కావడం నుంచి పోషకాల నిల్వ వరకు ఎన్నో ముఖ్యమైన పనులను నిర్వహిస్తుంది. అవేంటంటే..

మనం తీసుకునే ఆహారంలోని కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులను కాలేయం ప్రాసెస్ చేస్తుంది. తద్వారా శరీరానికి అవసరమైన శక్తి అందేందుకు సహాయపడుతుంది.

మందులు, మద్యం వంటి పదార్థాలను శరీరం వినియోగించుకునేలా లేదా బయటకు పంపేలా వాటిని విచ్ఛిన్నం చేసి ప్రాసెస్ చేస్తుంది.

కాలేయం తయారుచేసే పిత్తరసం కొవ్వుల జీర్ణక్రియకు, కొవ్వులో కరిగే విటమిన్లు శరీరంలో శోషించుకోవడానికి దోహదపడుతుంది.

ఆహారం ద్వారా లభించే అదనపు గ్లూకోజ్‌ను గ్లైకోజెన్ రూపంలో నిల్వ చేస్తుంది. శరీరానికి శక్తి అవసరమైనప్పుడు తిరిగి గ్లూకోజ్‌గా మార్చి రక్తంలోకి విడుదల చేస్తుంది.

రక్తంలో ద్రవ సమతుల్యతను కాపాడే అల్బుమిన్‌తో పాటు, రక్తం గడ్డకట్టడానికి అవసరమైన పలు ప్రోటీన్లను కాలేయం ఉత్పత్తి చేస్తుంది.

విటమిన్ A, D, E, K, B12తో పాటు ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలను అవసరమైనప్పుడు ఉపయోగించుకునేలా నిల్వ చేస్తుంది.

శరీరంలోకి ప్రవేశించే హానికర సూక్ష్మజీవులు, ఇతర అవాంఛిత పదార్థాలను గుర్తించి వాటిని తొలగించడంలో కాలేయంలోని ప్రత్యేక రోగనిరోధక కణాలు సహాయపడతాయి.

ఇలా శరీరంలోని అనేక కీలక ప్రక్రియల్లో కాలేయం భాగస్వామిగా ఉంటుంది. ఈ అవయవం పనితీరు దెబ్బతింటే జీర్ణక్రియ, పోషకాల వినియోగం, రక్తం గడ్డకట్టడం, రోగనిరోధక వ్యవస్థ వంటి ఇతర శరీర వ్యవస్థలపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *