అమరావతి, ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ నెల 20న విశాఖపట్నం–బాపట్ల మధ్య తీరాన్ని దాటే అవకాశముందని అంచనా వేసింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది.

వాయవ్య దిశగా తుపాను పయనం

ప్రస్తుతం ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది విశాఖపట్నానికి సుమారు 960 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపారు. వాయవ్య దిశగా కదులుతున్న ఈ వాతావరణ వ్యవస్థ నవంబర్ 16 నాటికి తుపానుగా, 17వ తేదీ నాటికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అనంతరం ఏపీ తీరం వైపు కదిలే అవకాశముందని పేర్కొంది.

గంటకు 145 కి.మీ. వేగంతో గాలులు!

తుపాను ప్రభావంతో నవంబర్ 19, 20 తేదీల్లో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాలతో పాటు రాయలసీమలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్. కరుణసాగర్ తెలిపారు. తీర ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో గాలి వేగం 110 నుంచి 145 కిలోమీటర్ల వరకు చేరవచ్చని వివరించారు.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు.

మత్స్యకారులకు హెచ్చరికలు

ఉత్తరాంధ్ర తీర ప్రాంతానికి గురు, శుక్రవారాల్లో తీవ్ర తుపాను సమీపించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసే అధికారిక హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని స్పష్టం చేశారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *