
గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ వినియోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎస్బీఐ రీసెర్చ్ విడుదల చేసిన ‘ఇండియాస్ కన్సంప్షన్ జర్నీ’ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని 95.3 శాతం గ్రామీణ కుటుంబాలు వంటకు ప్రధాన ఇంధనంగా ఎల్పీజీని వినియోగిస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలను కలిపి చూస్తే తెలంగాణలో మొత్తం ఎల్పీజీ వినియోగం 84.4 శాతంగా నమోదైంది.
మరోవైపు ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ 86.9 శాతం ఎల్పీజీ వినియోగంతో రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణలో వంట గ్యాస్ వినియోగం గణనీయంగా పెరగడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాలు కూడా దోహదపడినట్లు పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
దేశవ్యాప్తంగా 2,61,953 కుటుంబాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఎస్బీఐ రీసెర్చ్ ఈ నివేదికను రూపొందించింది. గ్రామీణ కుటుంబాల్లో వంట గ్యాస్ వినియోగం పెరుగుతున్న తీరును ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో వంట గ్యాస్ వినియోగంలో తెలంగాణ మరోసారి దేశవ్యాప్తంగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. రాష్ట్రంలోని 95.3 శాతం గ్రామీణ కుటుంబాలు వంటకు ప్రధాన ఇంధనంగా ఎల్పీజీని ఉపయోగిస్తున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది. ‘ఇండియాస్ కన్సంప్షన్ జర్నీ’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో దేశవ్యాప్తంగా కుటుంబాల వినియోగ అలవాట్లు, గృహ అవసరాలపై విశ్లేషణ చేపట్టారు. ఇందులో తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు అత్యధిక ఎల్పీజీ వినియోగంతో మొదటి స్థానంలో నిలిచాయి.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలను కలిపి చూస్తే ఎల్పీజీ వినియోగం 84.4 శాతంగా నమోదైంది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 95.3 శాతం కుటుంబాలు వంట గ్యాస్‌ను వినియోగిస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో ఈ వాటా 73 శాతంగా ఉంది. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లోనే వంట గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉంటుందనే అంచనాలకు భిన్నంగా తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలు ముందంజలో ఉండటం విశేషం.
గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ వినియోగంలో తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. తాజా గణాంకాలు రాష్ట్రంలోని గ్రామీణ కుటుంబాల్లో వంట గ్యాస్ వినియోగం ఎంతగా విస్తరించిందో స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఇంధన వినియోగంలో తెలంగాణ మరోసారి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ వినియోగంలో తెలంగాణ 95.3 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ 86.9 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పంజాబ్ 84.1 శాతం, కర్ణాటక 81.5 శాతం, తమిళనాడు 81.4 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో గ్రామీణ ఎల్పీజీ వినియోగం చాలా తక్కువగా నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌లో 15.3 శాతం, ఒడిశాలో 16.8 శాతం, జార్ఖండ్‌లో 17.2 శాతం, రాజస్థాన్‌లో 22.9 శాతంగా ఉంది. ఈ గణాంకాలు దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య స్వచ్ఛమైన వంట ఇంధన వినియోగంలో ఉన్న వ్యత్యాసాలను స్పష్టం చేస్తున్నాయి.
తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ వినియోగం పెరగడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాలు కూడా కీలకంగా దోహదపడ్డాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
గత 10 నుంచి 15 ఏళ్లలో వంట గ్యాస్ అందుబాటును పెంచేందుకు చేపట్టిన వివిధ కార్యక్రమాల వల్ల రాష్ట్ర జనాభాలో దాదాపు సగం మందికి ప్రయోజనం చేకూరిందని తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.3 కోట్ల మంది యాక్టివ్ ఎల్పీజీ వినియోగదారులు ఉన్నట్లు తెలిపారు. వీరిలో రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా దాదాపు 40 లక్షల మందికి, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మరో 10 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు అందినట్లు వివరించారు. వీటితో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల ద్వారా మరో 5 లక్షల మందికి ఎల్పీజీ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.
