
మెగాస్టార్ చిరంజీవి తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దుర్వినియోగం, డీప్‌ఫేక్ వీడియోలు, డిజిటల్ నకిలీ గుర్తింపుల వల్ల ఎదురవుతున్న ముప్పుల నుంచి ప్రజలు, కళాకారులకు రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్యపై గతంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రామ్ చరణ్‌తో కలిసి కలిసిన చిరంజీవి.. ఆయన దృష్టికి ఈ అంశాలను తీసుకెళ్లారు.
అమిత్ షా సూచన మేరకు తాజాగా కిషన్ రెడ్డిని కలిసి ఈ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన కిషన్ రెడ్డి.. సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుని ఈ అంశాలను ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు చిరంజీవి వెల్లడించారు.
కళాకారుల గౌరవం, వ్యక్తిగత గుర్తింపును కాపాడటంతో పాటు ప్రతి పౌరుడి డిజిటల్ భద్రతకు భరోసా కల్పించడం ఎంతో ముఖ్యమని చిరంజీవి పేర్కొన్నారు. ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేయకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత దుర్వినియోగం, డీప్‌ఫేక్ వీడియోలు, డిజిటల్ నకిలీ గుర్తింపుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచన మేరకు ఈ వినతిపత్రాన్ని అందజేసినట్లు చిరంజీవి వెల్లడించారు. సంబంధిత మంత్రిత్వ శాఖలతో చర్చించి ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ప్రస్తుతం ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ వ్యక్తుల ఫొటోలు, వీడియోలు, గొంతులను మార్ఫింగ్ చేసి నకిలీ కంటెంట్ సృష్టిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని డీప్‌ఫేక్ వీడియోలు, అభ్యంతరకరమైన దృశ్యాలను రూపొందించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ తరహా ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని చిరంజీవి కోరారు.
అమిత్ షా సూచనతో కిషన్ రెడ్డికి వినతి
ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను చిరంజీవి తనయుడు, నటుడు రామ్ చరణ్‌తో కలిసి కలిశారు. ఈ నెల 2వ తేదీన బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్ వీడియోల వల్ల ఎదురవుతున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలపై లిఖితపూర్వకంగా వినతిపత్రం సమర్పించాలని అమిత్ షా సూచించారు.
దీంతో తాజాగా చిరంజీవి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి మెమోరాండం అందజేశారు. కళాకారుల వ్యక్తిగత గుర్తింపు, గౌరవాన్ని కాపాడటంతో పాటు సామాన్య ప్రజల డిజిటల్ భద్రతకు కూడా తగిన రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా కోరారు.
ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ వ్యక్తుల అనుమతి లేకుండానే వారి ముఖాలు, గొంతులను ఉపయోగించడం, తప్పుడు ప్రచారాలు చేయడం, అభ్యంతరకరమైన వీడియోలు సృష్టించడం వంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలను నియంత్రించేందుకు పటిష్ఠమైన నిబంధనలు, తగిన రక్షణ చర్యలు అవసరమని సూచించారు.
డీప్‌ఫేక్ వీడియోల కారణంగా కళాకారుల ప్రతిష్ఠ, వ్యక్తిగత గౌరవానికి తీవ్ర భంగం కలుగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా నటీమణులు ఇలాంటి నకిలీ వీడియోలు, అసభ్యకరమైన కంటెంట్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గతంలో అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వ్యక్తుల అనుమతి, గోప్యత, గౌరవానికి భంగం కలగకుండా ఏఐ సాంకేతికత వినియోగంపై నియంత్రణ ఉండాలని చిరంజీవి కోరినట్లు తెలుస్తోంది.
ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు కేంద్ర హోంశాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి పటిష్ఠమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చిరంజీవి కోరారు. ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా అవసరమైన చట్టపరమైన నిబంధనలు రూపొందించాలని తన వినతిపత్రంలో సూచించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో వెల్లడించారు. ఇటీవల అమిత్ షాతో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాల నేపథ్యంలో ఆయన సూచన మేరకు కేంద్ర హోంశాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలకు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.
ఈ సమస్యపై స్పందిస్తూ సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుని చిరంజీవి లేవనెత్తిన ఆందోళనలను ముందుకు తీసుకెళ్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇందుకు కేంద్రమంత్రికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.
