
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కోఆర్డినేటర్లకు శుభవార్త అందించింది. వారి వేతనాలను 23 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న కోఆర్డినేటర్ల జీతాలు పెరగనున్నాయి.
ఇందులో భాగంగా జిల్లా కోఆర్డినేటర్ల నెలవారీ వేతనం ప్రస్తుతం ఉన్న రూ.36,000 నుంచి రూ.44,280కి పెరగనుంది. అలాగే అసిస్టెంట్ జిల్లా కోఆర్డినేటర్లు, టౌన్ కోఆర్డినేటర్ల జీతాలు రూ.27,000 నుంచి రూ.33,210కి చేరనున్నాయి.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల పరిధిలో సేవలందిస్తున్న 15,004 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, కోఆర్డినేటర్లకు ఆర్థికంగా ఊరట లభించనుంది. వేతనాల పెంపుతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కోఆర్డినేటర్లకు తీపికబురు అందించింది. జిల్లా కోఆర్డినేటర్లు (డీసీ), అసిస్టెంట్ జిల్లా కోఆర్డినేటర్లు (ఏడీసీ), టౌన్ కోఆర్డినేటర్ల (టీసీ) వేతనాలను 23 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా నిర్ణయం ప్రకారం జిల్లా కోఆర్డినేటర్ల నెలవారీ వేతనం ప్రస్తుతం ఉన్న రూ.36,000 నుంచి రూ.44,280కి పెరగనుంది. అలాగే అసిస్టెంట్ జిల్లా కోఆర్డినేటర్లు, టౌన్ కోఆర్డినేటర్ల జీతాలు రూ.27,000 నుంచి రూ.33,210కి చేరనున్నాయి.
ఈ కోఆర్డినేటర్లు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందించే సేవల పర్యవేక్షణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిని 2020లో నియమించగా, అప్పటి నుంచి ఇప్పటివరకు వేతనాల్లో ఎలాంటి సవరణలు జరగలేదు. తాజాగా ప్రభుత్వం 23 శాతం వేతన పెంపును ప్రకటించడంతో కోఆర్డినేటర్లకు ఆర్థికంగా ఊరట లభించనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక పరిపాలనా నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్‌హెచ్) పరిధిలోని ఆసుపత్రుల ఆధునికీకరణ పనులకు సంబంధించిన పూర్తయిన, పెండింగ్ పనుల బకాయిల చెల్లింపుల కోసం రూ.67.25 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధుల వినియోగానికి పరిపాలనాపరమైన ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు రాష్ట్రంలోని మూడు ప్రభుత్వ బీఈడీ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి నియమించిన 15 మంది గెస్ట్ లెక్చరర్లకు గౌరవ వేతనాలు చెల్లించేందుకు అనుమతించింది. గంటకు రూ.400 చొప్పున, నెలకు గరిష్ఠంగా రూ.28,000 మించకుండా వేతనం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
అలాగే అంగన్‌వాడీ కేంద్రాలకు బాల సంజీవని, బాలామృతం వంటి పోషకాహార ఉత్పత్తుల సేకరణ, సరఫరా కోసం ప్రభుత్వం రాష్ట్రస్థాయి కొనుగోలు కమిటీని ఏర్పాటు చేసింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా, మరో 10 మంది అధికారులు సభ్యులుగా ఉండనున్నారు.
నవంబర్ 26న ఏపీ కేబినెట్ సమావేశం
మరోవైపు నవంబర్ 26న అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేసి నవంబర్ 25వ తేదీ ఉదయం 10:30 గంటల్లోగా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి అందజేయాలని అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు.
